పల్లెల్లో పబ్లిక్‌స్కూల్స్
ABN , Publish Date - May 05 , 2026 | 01:23 AM
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటును వేగవంతం చేస్తోంది.
జగిత్యాల, మే4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటును వేగవంతం చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీపీఎస్‌లను ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం గ్రామీణ ప్రాంతాల విద్యాభివృద్ధికి కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పాఠశాలలను ఎంపిక చేశారు.
ఫడేటా ఆధారిత ఎంపిక..
పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలన నిర్ణయంగా కాకుండా డేటా ఆధారంగా చేపట్టడం ఈ ప్రక్రియలో ప్రత్యేకతగా నిలిచింది. మండల స్థాయి నుంచి పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసింది.
ఫనియోజకవర్గాల వారీగా ఎంపిక..
జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం సాతారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్‌స్కూల్స్‌గా మార్పు చేయడానికి ఎంపిక చేశారు. సంబంధిత పాఠశాలలు భౌగోళికంగా, విద్యార్థుల అవసరాల పరంగా కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఎంపికతో సమీప గ్రామాల విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
ఫమౌలిక వసతుల కల్పన
జిల్లాలోని మూడు టీపీఎస్ పాఠశాలల ఏర్పాటుకు రూ.114.99 కోట్ల నిధులతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఇందులో అంతర్గాం పాఠశాలకు రూ.38.66 కోట్లు, చిల్వకోడూరు పాఠశాలకు రూ. 37.33 కోట్లు, సాతారం పాఠశాలకు రూ.39 కోట్లు నిధులు అవసరమని అంచాన వేసి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిధులతో అదనపు ఫ్లోర్లు, అదనపు తరగతి గదులు, డైనింగ్‌హాల్స్, టాయిలెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్స్, లైబ్రరీ, కిచెన్‌షెడ్స్ నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించనున్నారు. దీంతో జిల్లాలో విద్యార్థుల సామర్థ్యాలు పెరడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. టీపీఎస్ ప్రణాళిక అమలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందనుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యా రంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశ ం ఉంది.
ఫఒక్కో టీపీఎస్‌లో వెయ్యి మంది విద్యార్థులు
జిల్లాలోని ఒక్కో టీపీఎస్‌లో సుమారు వెయ్యి మంది విద్యార్థుల సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఇందులో ప్రీ పైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, 11వ, 12వ తరగతులు ఉంటాయి. సైన్స్ ల్యాబ్, ఆట స్థలం, క్రీడా సామాగ్రి, కొరత లేని టీచర్లు, అత్యాధునిక ల్యాబ్స్, పూర్తి స్థాయిలో ఇన్‌ఫాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, కొత్త భవనాల నిర్మాణాల కోసం నిధులు రానున్నాయి. దూర ప్రాంతాల పాఠశాలలు విలీనం చేస్తే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది. టీపీఎస్‌లలో ఎన్ని పాఠశాలలు విలీనం చేస్తారనే పక్కా సమాచారాన్ని త్వరలో వెలువరించడానికి విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.
ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయం
-సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్‌స్కూల్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయం. టీపీఎస్‌ల ఏర్పాటు వల్ల గ్రామీణ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించే అవకాశాలున్నాయి. పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ నిర్ణయం మేరకే...
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ నిర్ణయం మేరకు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నాం. అంతర్గాం, చిల్వకోడూరు, సాతారం గ్రామాల్లో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను టీపీఎస్‌లుగా మార్చడానికి నిర్ణయించాం. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం.