నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:49 AM
నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, నవంబరు24(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి మంగళవారం పాలభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ గృహావసరాలు, వ్యవసాయానికి నిరంతర కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం రెండు గ్రామాలకో విద్యుత్తు సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోందని అన్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో నాలుగు విద్యుత్తు సబ్ స్టేషన్లకు రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఏ సంక్షేమ పథకాన్ని రద్ధు చేయకుండా అమలు చేయడంతో పాటు నూతన పథకాలకు శ్రీకారం చుట్టి బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. 500 రోజుల్లో అధికారంలోకి వస్తోందని కేటీఆర్ పేర్కొంటూ కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కలలు కంటున్నారని, 5000 రోజులైనా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత బీఆర్‌ఎస్ వెళ్లిపోయిన రైలు అని, తిరిగి రాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అవినీతి, అక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి బయట పెట్టి ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు. ఈ నెల 25న టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ’ఓటు బచావో- దేశ్ బచావో ’ కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దేవానందం, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాజేందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గౌస్, లక్ష్మారెడ్డి, సుధాకర్, రాములు, పద్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.