Share News

‘ప్రజావాణి’లో నిరసనలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:30 AM

కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

‘ప్రజావాణి’లో నిరసనలు
కళ్ళకు గంతలు కట్టుకొని అధికారులతో మాట్లాడుతున్న కోట శ్యామ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగరానికి చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్‌కుమార్‌ కళ్లకు గంతలు కట్టుకొని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు రాగా పోలీసులు ఆయనను ఆడిటోరియం ఎదుట అడ్డుకున్నారు. దీనితో ఆయన కళ్ళకు గంతలు విప్పి కలెక్టర్‌ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రేకుర్తి, చింతకుంట, విద్యానగర్‌, కొత్తపల్లి, ఆరెపల్లిలోని పట్టాభూములు, ఇళ్ల స్థలాలను 22/ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తొలగించాలంటూ అధికారులకు సర్వే నంబర్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. మానకొండూర్‌, తిమ్మాపూర్‌ మండలానికి చెందిన వ్యవసాయ భూముల్లోకి రేణుకుంట గ్రామానికి చెందిన బొంగాని రాజుగౌడ్‌, బానాల కరుణాకర్‌ అనే వ్యక్తులు చొరబడి భయబ్రాంతులకు గురిచేస్తూ బెదిరిస్తున్నారని ప్లకార్డులతో బాధితులు కలెక్టరేట్‌ ఆడిటోరియం ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్లకార్డులను పక్కనబెట్టి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఫ ప్రజావాణికి 145 దరఖాస్తులు

సుభాష్‌నగర్‌: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుండి 145 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పెండిగ్‌లో ఉంచవద్దన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాఖడే, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిలతో కలిసి వినతులు స్వీకరించారు.

Updated Date - Sep 22 , 2026 | 12:30 AM