రక్షణ చర్యలు తీసుకోవాలి..
ABN , Publish Date - May 17 , 2026 | 12:28 AM
అంతరాష్ట్ర సాయుధ ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో శనివారం బ్యాంక్‌లు, జ్యువెలరీ షాపుల ప్రతినిధులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
- బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
- పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, మే 16 (ఆంధ్రజ్యోతి): అంతరాష్ట్ర సాయుధ ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో శనివారం బ్యాంక్‌లు, జ్యువెలరీ షాపుల ప్రతినిధులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల పీఎంజే జ్యువెలర్స్‌లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, కమిషనరేట్ పరిధిలోని అన్ని వ్యాపార, ఆర్థిక సంస్థల యాజమాన్యాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ఆలం మాట్లాడుతూ... బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, లాకర్ రూములు కవర్ అయ్యేలా హై-రిజల్యూషన నైట్ విజన సీసీ టీవీ కెమెరాలను నిరంతర విద్యుత బ్యాకప్‌తో ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన, కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించిన బర్గర్ అలారంలు, పానిక్ బటన్లను అమర్చడంతో పాటు, గుర్తింపు పొందిన సెక్యూరిటీ గార్డులను (వీలైనంత వరకు సాయుధ సిబ్బందిని) నియమించుకోవాలని సూచించారు. లోపలికి అనవసరమైన వ్యక్తుల రాకపోకలను నియంత్రించాలని, నగదు, బంగారం రవాణా సమయాల్లో గోప్యత పాటించాలని సూచించారు. సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన తప్పనిసరిగా చేయించాలని సీపీ ఆదేశించారు. హెల్మెట్ ధరించి అనవసరంగా లోపలికి వచ్చే వారిపై, పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానం వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఫ కమిషనరేట్‌లో 24 గంటల పెట్రోలింగ్, విస్తృత నాకాబందీ
కమిషనరేట్ పరిధిలోని వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంల పరిసరాల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా 24 గంటల నిరంతర పెట్రోలింగ్ ముమ్మరం చేశామని సీపీ తెలిపారు. నగర ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, జాతీయ రహదారులపై ఆకస్మిక నాకాబందీలు, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతరాష్ట్ర ముఠాలు, చోరీ సొత్తును కొనుగోలు చేసేవారిపై నిఘా ఉంచేందుకు స్పెషల్ బ్రాంచ, టాస్క్‌ఫోర్స్, లోకల్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. పొరుగు జిల్లాలు, ఇతర రాషా్ట్రల పోలీస్ ఏజెన్సీలతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, అద్దె ఇళ్లు, కొత్తగా వలస వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించి ముమ్మరంగా తనిఖీలు (వెరిఫికేషన డ్రైవ్స్) చేస్తున్నామన్నారు. అంతర్రాష్ట్ర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ప్రజల, వ్యాపారుల సహకారం ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా, గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించినా, అనుమానాస్పద వాహనాలు నిలిపి ఉంచినా వెంటనే పోలీసులకు లేదా డయల్ 1010,112కు సమాచారం అందించాలని సూచించారు.
ఫ గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్సహాలులో విశ్వ హిందూపరిషత, బజరంగ్‌దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ... పండుగ వేళ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. పశువుల అక్రమ రవాణా లేదా గోవధకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, తక్షణమే పోలీసులకు తెలియజేయాలన్నారు. అలా కాదని చట్టాన్ని అతిక్రమిస్తే తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టం-1977(తెలంగాణ ప్రొహిబిటెడ్ ఆఫ్ కవ్ స్లాటర్ అండ్ ఎనిమల్ ప్రిజర్వేషన యాక్టు 1977) ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం ఉందని, పటిష్ట నిఘా పెట్టామన్నారు. పశువుల రవాణాకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ఆరు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. సమావేశంలో టౌన ఏసీపీ వెంకటస్వామి, ఇనస్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజనరెడ్డి, హిందూ సంఘాల పెద్దలు ఉట్కూరి రాధాకృష్ణరెడ్డి, రమేష్, శంకర్ పాల్గొన్నారు.