ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - May 03 , 2026 | 12:09 AM
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. శనివారం జిల్లాకేంద్రం పద్మనాయక కల్యాణమండపంలో టీఎస్‌యూ టీఎఫ్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్ నుంచి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు ఎర్రజెండాలతో పద్మనాయక కళ్యాణ మండపం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్విహించారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన దాచూరి రామిరెడ్డి 10వర్ధంతి సభ జరిగింది. సభ ప్రాంగణంలో రామిరెడ్డి చిత్రపటానికి రాష్ట్ర, జిల్లానాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడారు. ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం, ఉపాధ్యాయసంఘాలు(జేఏసీ) మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరగాలని అన్నారు. నేను నా ఉద్యోగం అని గిరిగీసుకొని ఉండవద్దని, సమాజం బాగుంటే మనం బాగుంటాం అని అన్నారు. సంఘంలో ఉపాధ్యాయుడికి కష్టం వస్తే ఆ ఉపాధ్యాయుడి కోసం కృషిచేసే ఏకైక సంఘం టీఎస్‌యూటీఎఫ్ మాత్రమే అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మొదటి పోరాటంలో భాగంగా గత ఏప్రిల్17న ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో బోజన విరమణ సమయంలో నిరసన తెలపడం జరిగిందన్నారు. మే5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షకు పిలుపున్వివడం జరిగిందని దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. ప్రముఖ విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ రామిరెడ్డి 7వ వర్ధంతి నుంచి యూటీఎఫ్ కుటుంబ సభ్యుల కోసం సంక్షేమ పథకాన్ని అమలు చేయడం ఆర్థికంగా సహాయం అందించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్రఉపాధ్యక్షుడు, ఎఫ్‌డబ్ల్యుఎఫ్ కన్వీనర్ ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టీ లక్ష్మారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, రాష్ట్ర కార్యదర్శులు రాజు రవికుమార్, వీ శాంతి, సత్యానంద్, వై జ్ఞానమంజుల, పీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.