కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులు నింపాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:20 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, రైతులపై ప్రేమ ఉంటే కన్నెపల్లి వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేసి ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నింపాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, రైతులపై ప్రేమ ఉంటే కన్నెపల్లి వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేసి ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నింపాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరాన్ని నిర్మించారని అన్నారు. బీఆర్‌ఎస్ ఓటర్ల పేర్లను తొలగించే అవకాశాలున్నందున బీఎల్‌ఎలు అప్రమత్తంగా ఉండి ఎస్‌ఐఆర్‌లో ఓట్లను నమోదు చేయించాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు ప్రతి డివిజన్‌లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి సర్‌లో అర్హులైన ఓటర్లందరి పేర్లను నమోదు చేయించాలన్నారు. సర్‌లో బీఎల్‌ఏల పాత్ర కీలకమని, అప్రమత్తంగా ఉంటూ వారం, పదిరోజుల్లోనే ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. వారం పది రోజుల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసిన మొదటి 10 మంది బీఎల్‌ఏలను సన్మానించాలని ఎమ్మెల్యే గంగులకు సూచించారు.
ఫ ఎల్‌నినో రేవంత్‌రెడ్డిని తరిమికొట్టాలి
‘ఎల్‌నినో ప్రకృతి తెచ్చింది. మనకు మాత్రం డిసెంబరు 7, 2023న రేవంత్‌రెడ్డి మన పాలిట ఎల్‌నినో అయిపోయిండు. ఈ ఎల్‌నినోను తరిమికొట్టాలి’ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంపుహౌస్‌లు, 203 కిలో మీటర్ల గ్రావిటీ టన్నెళ్లు, 1700 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్లు, సబ్‌స్టేషన్లు అన్నారు. అలాంటి మహత్తర ప్రాజెక్టుపై బోగస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రోజు కూడా మేడిగడ్డ వద్ద 10వేల క్యూసెక్కుల నీరుందని, మరో 10వేల క్యూసెక్కుల నీరు వస్తున్నదన్నారు. మేడిగడ్డలో దెబ్బతిన్న రెండు పిల్లర్లు రిపేర్ చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అబద్దాలు, దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు గేట్లు మరమ్మతు చేయడానికి రెండున్నరేళ్లు సరిపోదా అని ప్రశ్నించారు. వరంలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఆపి మీ బురద రాజకీయాల కోసం ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి రాజకీయాలు ముఖ్యమో.. ప్రజలు, రైతులు ముఖ్యమో ఆలోచించాలన్నారు. రైతులు కంచె వేసి కాపాడుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారని, నీవు రైతులకు చేసిందేమిటి, ఎందుకు నిన్నుకాపాడుకోవాలని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిడ్‌మానేరు, ఎల్‌ఎండి వట్టిపోయాయని, సాగు, తాగునీటి కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌వద్ద మోటార్లు ఆన్‌చేసి నీటిని తీసుకురావాలసిన అవసరముందన్నారు. నియోజకవర్గంలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని, బొమ్మకల్‌లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎత్తుకెళితే తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించిన తమపై కేసులు పెట్టారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులను తొలగిస్తామని పార్టీశ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నియోజకవర్గ ఇన్‌చార్జి, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.