పల్లెల్లో మొదలైన మద్య నిషేధం
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:28 AM
పల్లెల్లో మద్య నిషేధం అమలుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. బెల్ట్‌షాపులతో ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది.
మంథని, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మద్య నిషేధం అమలుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. బెల్ట్‌షాపులతో ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. దీంతో సమయం, సందర్భం లేకుండా మద్యం తాగుతూ ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారు. యువత కూడా మద్యానికి బానిసవుతున్నారు. ఇక మద్యం మత్తులో గొడవలు జరుగుతుండడం, పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మద్యానికి బానిసై పనీ పాట లేకుండా యువత జులాయిగా తిరుగుతుండడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు పడుతున్నాయి.
మంథని మండలంలోని పలు గ్రామాల్లో మద్యం విక్రమాలపై నిషేధం అమలును ప్రకటించారు. మండలంలోని గాజులపల్లి, సూరయ్యపల్లి, ఎక్లాస్‌పూర్, బెస్తపల్లి గ్రామాల్లో ఇప్పటికే మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. తాజాగా మండలంలోని కన్నాల, నాగారం గ్రామాల్లో సెప్టెంబరు 1 నుంచి మద్యం విక్రయాలను నిషేధిస్తూ పాలకవర్గం తీర్మానించింది. మద్యం విక్రయాలు చేస్తే రూ. 15 వేల నుంచి 50 వేల వరకు జరిమానా, సమాచారం అందించిన వారికి రూ. 5 వేల వరకు నజరానాగా ప్రకటించారు. ఈ మేరకు మద్య నిషేధం తీర్మానం కాపీలను పోలీసు, ఎక్సైజ్ స్టేషన్లలో అధికారులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అందజేశారు. వీటిని ఉల్లంఘించి వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని మరి కొన్ని గ్రామాల్లో సైతం పాలకవర్గ సభ్యులు మద్యం విక్రయాల పై నిషేధం విధించడానికి సిద్ధపడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులో మద్యం, గుడుంబా విక్రయాలు నిలిపి వేస్తే పల్లెల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. గ్రామాల్లో వ్యవసాయ, హమాలీ, ఇతర కష్ట పని తీవ్ర పని ఒత్తిడితో శారీరకంగా అలసి పోయే వారికి, శుభ, ఆశుభ కార్యక్రమాల సమయాల్లో ఇలాంటి తీర్మానాలు ఇబ్బందికరంగా మారాయి. మరో వైపు టార్గెట్లతో మద్యం విక్రయాలు జరిపించే ఎక్సైజ్ శాఖ అధికారులకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. ఏది ఏమైనా పల్లెలు సంపూర్ణ మద్య పాన నిషేధం వైపు కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.