ఆర్టీసీ కార్గోకు ప్రైవేట్ గ్రహణం
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:38 AM
ప్రైవేట్ కొరియర్ సంస్థలను తలదన్ని ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ కార్గో విభాగం ఆర్టీసీకి లాభాలను ఆర్జించి పెడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభాగం ద్వారా యేటా 100 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా కరీంనగర్ రీజియన్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రైవేట్ కొరియర్ సంస్థలను తలదన్ని ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ కార్గో విభాగం ఆర్టీసీకి లాభాలను ఆర్జించి పెడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభాగం ద్వారా యేటా 100 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా కరీంనగర్ రీజియన్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి. ఏరోజుకారోజు వినియోగదారులకు చెప్పిన టైమ్‌కు పార్సిళ్లను అందిస్తూ ఆర్టీసీ కార్గో విభాగం ప్రజలకు చేరువైంది. చిన్న కవర్ల నుంచి పెద్ద పార్సిళ్ల వరకు బుక్ చేసిన రోజే గమ్యం చేర్చడంలో కార్గో విభాగం సఫలం కావడంతో ప్రజలు ఆర్టీసీ అందిస్తున్న ఈ సేవలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.
ఫ రీజియన్‌లో 41 కౌంటర్ల ద్వారా సేవలు
కరీంనగర్ రీజియన్‌లోని 11 డిపోల్లో 41 కౌంటర్ల ద్వారా ఆర్టీసీ పార్సిళ్లను స్వీకరిస్తూ అందిస్తూ గత సంవత్సరం 8.35 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. సగటున నెలకు 70 లక్షల ఆదాయం వచ్చింది. కరీంనగర్-1, 2 డిపోలు, గోదావరిఖని, సిరిసిల్ల, జగిత్యాల డిపోల్లో మాత్రమే ఆర్టీసీ ఆధ్వర్యంలో పార్సిళ్ల సేకరణ, అందించడం జరుగుతుండగా మిగతా ఆరు డిపోల్లో 36 కౌంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. వీటిని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు మూడు సంవత్సరాలపాటు ఈ సేవలు నిర్వహించేందుకు అగ్రిమెంట్ చేసింది. జిల్లా కేంద్రంలో ఐదు వేల రూపాయలు, మండల కేంద్రాల్లో వెయ్యి రూపాయల డిపాజిట్‌తో ప్రైవేట్ వ్యక్తులు ఈ కార్గోసేవల కేంద్రాలను పొంది నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో పార్సిల్ బుక్ చేస్తే దాని విలువలో 12 శాతం, పార్సిల్ డెలివరీలో ఒక్కోదానికి 20 రూపాయలు కమీషన్‌గా ఆర్టీసీ సదరు కాంట్రాక్టు వ్యక్తులకు చెల్లిస్తున్నది. ఈ ప్రైవేట్ కౌంటర్లలో ఔట్‌సోర్సింగ్ ద్వారా 24 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆర్టీసీ నిర్వహిస్తున్న కౌంటర్లలో నలుగురు ఆర్టీసీ ఉద్యోగుల చొప్పున మూడు షిఫ్టుల్లో 12 మంది ఈ సేవలందిస్తున్నారు. సంవత్సర కాలంలో కరీంనగర్-1 డిపో రీజియన్‌లోనే అత్యధిక పార్శిళ్ళను స్వీకరించడమే కాకుండా గమ్యస్థానాలకు చేర్చడంలో ముందుండి 4,36,21,939 రూపాయల ఆదాయాన్ని పొందింది. 1,05,72,079 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడం ద్వారా సిరిసిల్ల డిపో రెండో స్థానంలో నిలువగా 98.69 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందిన గోదావరిఖని డిపో మూడో స్థానంలో, 74.34 లక్షల ఆదాయాన్ని పొందిన జగిత్యాల నాల్గవ స్థానంలో నిలిచింది. మొత్తం 11 డిపోల ద్వారా సంవత్సర కాలంలో 4,79,169 పార్సిళ్లను స్వీకరించి అందించారు. 8,34,56,619 రూపాయల ఆదాయం ఈ కార్గో విభాగం ద్వారా ఆర్టీసికి సమకూరింది. కార్గో విభాగం ప్రారంభించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులనే దీనికోసం వినియోగించారు. ఆ తర్వాత ప్రైవేట్ వారితో అగ్రిమెంట్ కుదుర్చుకొని మూడు సంవత్సరాల కోసం మెట్‌పల్లి, వేములవాడ, మంథని, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోలలోని 36 కౌంటర్లను వారికి అప్పగించారు.
ఫ కార్గోపై రాజకీయ నాయకుల కన్ను
మెరుగైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందడం ద్వారా కోట్లాది రూపాయల అదనపు ఆదాయాన్ని ఆర్టీసీ దక్కించుకుంటోంది. ఇప్పుడు కార్గో విభాగాన్ని మొత్తంగా కాని, కొన్ని రీజియన్లను కానీ ప్రైవేట్‌కు అప్పగించాలని ప్రయత్నాలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతున్నది. కమీషన్ పద్ధతిలో కాకుండా మొత్తంగా ఈ సేవలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తారని తెలిసింది. ఆర్టీసీ కార్గో విభాగం లాభాల్లో నడుస్తుండడంతో రాజకీయ నాయకుల కన్ను ఈ విభాగంపై పడిందని, తమ అనుచరులకు ఈ సేవల కాంట్రాక్టును అప్పగించి లబ్దిచేకూరేలా చూడాలనే ప్రయత్నంలో భాగమే ఈ ఆలోచనలనే విమర్శలు వస్తున్నాయి. ఈ విభాగాన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తే ధరలు పెరగడమే కాకుండా సేవలు కూడా ఆర్టీసీలో లభిస్తున్నట్లుగా ఉండక పోవచ్చని అంటున్నారు. అప్పుడు మళ్లీ ప్రైవేట్ కొరియర్లు, పార్సిల్ సంస్థల వైపు ప్రజలు చూడాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీనే కార్గో సేవలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టు ఇవ్వవద్దని ప్రజలు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.