Share News

సన్నాల సాగుకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 28 , 2026 | 01:06 AM

జిల్లాలో యేటా యాసంగి, వానాకాలంలో వరుసగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు.

సన్నాల సాగుకు ప్రాధాన్యం

జగిత్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యేటా యాసంగి, వానాకాలంలో వరుసగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు. అయితే ఒకే రకం ధాన్యం సాగు చేయడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోవడం, దిగుబడి పెరిగినా అమ్మకాల్లో ఇబ్బందులు రావడం, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి పడిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవలం ఒకే రకం ధాన్యం ఉత్పత్తి కావడంతో ప్రభుత్వ స్థాయిలో కూడా కొనుగోలు, నిల్వ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో గోదాంల సంఖ్య పరిమితంగా ఉండడంతో అధిక ధాన్యం నిల్వ చేయడం కష్టసాధ్యమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పంటల మార్పు అవసరాన్ని గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫసన్న రకానికి డిమాండ్‌..

దొడ్డు రకంతో పోలిస్తే సన్నరకం ధాన్యానికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉండడంతో సన్నధాన్యం రైతులకు లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ సన్నధాన్యం సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్లు, పొలాస ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రీసెర్చ్‌ సెంటర్‌లలో అభివృద్ధి చేసిన అధిక దిగుబడి సన్నరకం విత్తనాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలో కూడా వీటి పంపిణీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారు చేసిన సన్నరకం సీడ్‌తో అధిక దిగుబడి, మంచి మార్కెట్‌ విలువ కలిగిన రకాలే కావడంతో రైతులు సాగు చేస్తే అమ్మకాల సమస్యలు తగ్గడంతో పాటు మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఈ విత్తనాలు జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలతో పాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తున్న విత్తన మేళాల్లో లభిస్తాయి. మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి సైతం సీడ్‌ లభ్యతపై సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు.

ఫజిల్లాలో విస్తీర్ణం..

జిల్లాలో 7,28,950 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 4,48,073 ఎకరాల్లో ప్రతీ యేటా వివిధ పంటలను సుమారు 2,48,550 మంది రైతులు సాగు చేస్తున్నారు. 2026 వానాకాలం సీజన్‌లో సుమారు 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో 2.55 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు చేసే లక్ష్యంతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో కేవలం 65 వేల ఎకరాల్లోనే సన్నాల సాగు జరిగింది. ప్రస్తుతం 2.40 లక్షల ఎకరాల్లో పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను గ్రామ స్థాయిలో లక్ష్యాలను ఖరారు చేశారు. ఏఈవోలు, ఏవోలు, ఏడీలు పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫమిల్లర్లు సైతం ప్రచారం

జిల్లాలో సన్నాల సాగును పెంచడానికి రైస్‌మిల్లర్లు సైతం ప్రణాళిక బద్ధంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ నుంచి మొదలుకొని అడిషనల్‌ కలెక్టర్లు, సివిల్‌ సప్లయిస్‌ శాఖ అధికారి, సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ మేనేజర్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎంసీ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీలు, రైతు సంఘాలను భాగస్వామ్యం చేస్తూ రైతుల్లో అవగాహణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి కరపత్రాలు అందించారు. ఫర్టిలైజర్‌ దుకాణాలు, సీడ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌, మిల్లులు, గ్రామ పంచాయతీ కూడళ్ల వద్ద పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఫరీసెర్చ్‌ సెంటర్లు ఇవే..

రాష్ట్రంలోని వ్యవసాయ రీసెర్చ్‌ సెంటర్లు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో వానాకాలానికి అనువైన సన్నరకం వరి విత్తనాలను పెద్దఎత్తున తయారు చేశారు. ప్రస్తుతం జగిత్యాల ఏఆర్‌ఎస్‌, రాజేంద్రనగర్‌ పీజేటీఎస్‌ఏయూ, వరంగల్‌ ఏఆర్‌ఎస్‌, భూపాలపల్లి ఏఆర్‌ఎస్‌ వంటి కేంద్రాల్లో సీడ్‌ మేళాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేళాల్లో పలు రకాలకు సంబంధించి అధిక దిగుబడి సన్నరకం విత్తనాలు రైతులకు నేరుగా అందించనున్నారు. రైతులు సమీప ప్రాంతాల్లోని కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసే అవకాశాలు కల్పిస్తున్నారు.

అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే...

-నవీన్‌రావు, బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో సన్నాల సాగు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో మార్కెటింగ్‌ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నాలు సాగు చేస్తేనే ఇటు రైతులకు, అటు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. సన్నాల సాగును పెంచడానికి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం.

సన్నరకాలే మేలు..

- భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

వానాకాలంలో రైతులు మంచి లాభాలు, మార్కెట్‌ అవకాశాలు ఉన్న సన్నరకం వరి సాగు వైపు దృష్టి సారిస్తే మేలు. ఇందుకు అవసరమైన పలు రకాల సన్నరకం సీడ్‌ను ఆయా రీసెర్చ్‌ సెంటర్లలో తయారు చేశారు. రైతులు నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో మండల ఏవోలను సంప్రదిస్తే ఎక్కడ దొరుకుతుందనే సమాచారం చెబుతారు. సాధ్యమైనంత తొందరలో ఎరువుల దుకాణాల్లో సైతం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.

-------------------------------------------------------------------------------

వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న విత్తనాల వివరాలు...

-------------------------------------------------------------------------------

రకం.. పంట కాల వ్యవధి (రోజుల్లో)...

బీపీటీ 5204 (సాంబ మసూరి) - 145-150

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (తెలంగాణ సోనా) - 125

కెఎన్‌ఎం 1638 (కూనారం వరి-2) - 120-125

జెజిఎల్‌ 1798 (జగిత్యాల సన్నాలు) - 125

జై శ్రీరామ్‌ - 135-140

హెచ్‌ఎంటీ సోనా - 130-140

Updated Date - May 28 , 2026 | 01:06 AM