Share News

సన్న బియ్యం ధరలకు రెక్కలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:54 AM

సన్న బియ్యం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

సన్న బియ్యం ధరలకు రెక్కలు

జగిత్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సన్న బియ్యం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత యేడాదితో పోలిస్తే క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,800 వరకు పెరుగుదల కనిపిస్తోంది. రెండు నెలల కాలంలో సుమారు రూ.1,400 వరకు ధరలు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం తక్కువగా ఉందని ఆశించినంత దిగుబడి రాకపోవచ్చునని వ్యాపారులు అంచనా వేసి ధరలు పెంచేశారంటున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా రేషన్‌బియ్యం ఇస్తుండడం కొంత ఉపశమనం కలిగిస్తుండగా ఇతర వర్గాలపై బియ్యం ధరల ప్రభావం బాగానే ఉంది. వానాకాలం వరి కోతలు ప్రారంభమైతే కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఫసన్నబియ్యానికి డిమాండ్‌..

జిల్లాలో సన్నబియ్యానికి వినియోగదారుల నుంచి అధిక డిమాండ్‌ ఉంది. సాధారణ బియ్యంతో పోలిస్తే సన్నబియ్యాన్నే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతున్నాయి. వివిధ రకాల బియ్యానికి నాణ్యత, బ్రాండ్‌, మిల్లింగ్‌ విధానం ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

ఫఏడాదిలోనే భారీ మార్పు..

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం బియ్యం ధరలు అధికంగా ఉన్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు పెరగడంతో దాని ప్రభావం క్రమంగా రిటైల్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మిల్లుల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు, అక్కడి నుంచి చిల్లర దుకాణాలకు చేరే క్రమంలో రవాణా, మిల్లింగ్‌, ప్యాకింగ్‌, ఇతర ఖర్చులు కలుస్తుండటంతో వినియోగదారులు మరింత ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.

ఫకుటుంబ బడ్జెట్‌పై ప్రభావం

ఒక కుటుంబానికి నెలకు 25 నుంచి 50 కిలోల వరకు బియ్యం అవసరమయ్యే పరిస్థితి ఉంది. ధరలో కిలోకు కొన్ని రూపాయల పెరుగుదల కనిపించినా నెలాఖరుకు అది వందల రూపాయల అదనపు భారంగా మారుతోంది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే విద్య, వైద్యం, విద్యుత్‌, రవాణా ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

ఫనిల్వలపై నిఘా అవసరం..

ధరలు పెరుగుతున్న సమయంలో కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో నిల్వలు ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో బియ్యం నిల్వలు, హోల్‌సేల్‌, రిటైల్‌ ధరలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశాలపై తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

సామాన్యులపై మరింత ఆర్థిక భారం

- అడిగొప్పుల రజిని, గృహిణి, జగిత్యాల జిల్లా

ప్రస్తుత సీజన్‌లో బియ్యం ధరలు పెరగడం సామాన్య కుటుంబాలపై మరింత ఆర్థిక భారం మోపుతోంది. రోజురోజుకూ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు తోడు బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ధరలు నియంత్రించాలి

- బాస భవ్య, గృహిణి, తిమ్మాపూర్‌ గ్రామం

మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలను అధికారులు నియంత్రించాలి. వ్యాపారులు కృతిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టాలి. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

మార్కెట్‌లో బియ్యం ధరలు ఇలా...

--------------------------------------------------------------------------------

రకం.. గత ఏడాది క్వింటాలుకు.. ప్రస్తుతం

--------------------------------------------------------------------------------

హెచ్‌ఎంటీ రూ.4,000 రూ.6,400

బీపీటీ రూ.4,600 రూ.5,200

జైశ్రీరాం రూ.5,800 రూ.8,000

Updated Date - Oct 02 , 2026 | 12:54 AM