Share News

రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకం

ABN , Publish Date - May 13 , 2026 | 12:21 AM

రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకం
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

సుభాష్‌నగర్‌, మే 12(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. కరీంనగర్‌లోని ఇందిరాగార్డెన్‌లో దళిత కైస్త్రవులు రాజ్యాంగ హక్కులు సామాజిక హోదా అనే అంశం మీద మహాసభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయని, ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25కు పూర్తి వ్యతిరేకమని, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మతాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది కుల వ్యవస్థ మాత్రమేనని, దళితులు ఏ మతంలో ఉన్న వారిపై జరుగుతున్న ఆకృత్యాలకు కులమే కారణమన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుచేసి దళిత కైస్త్రవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నారు. దళిత కైస్త్రవులకు నమ్మకద్రోహం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, సిక్కు దళితులకు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగానే దళిత కైస్త్రవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కైస్త్రవ మతంలోకి వెళ్లిన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య ఇతర అగ్రకులాల సామాజిక హోదా మారనప్పుడు దళితుల హోదా మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. కైస్త్రవంలోకి వెళ్లిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు, కైస్త్రవంలోకి వెళ్లిన బీసీలు, ఎస్టీలు వారి రిజర్వేషన్‌ వాళ్లు పొందుతున్నప్పుడు కైస్త్రవంలోకి వెళ్లిన దళితులు మాత్రమే రిజర్వేషన్‌ పొందడానికి ఎందుకు అనర్హులవుతారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎవరి మీద లేని ఆంక్షలు దళితుల మీదనే ఎందుకు పెడుతున్నారని, ఈ వివిక్షను సమాజమంతా అర్థం చేసుకోవాలని అన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి, దళిత కైస్త్రవులు ఎస్సీ హోదా కోల్పోవడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీనే అని విమర్శించారు. సిక్కు దళితులకు, బౌద్ధ దళితులకు మినహాయింపులు ఇచ్చి న్యాయం చేసినట్టుగానే దళిత కైస్త్రవులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్‌ పూర్తి వివక్షను పాటించిందన్నారు. కాంగ్రెస్‌ చేసిన మోసాలను ఇకనైనా దళిత కైస్త్రవ సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు. గతంలో సిక్కు దళితులు, బౌద్ధ దళితులు పోరాటం చేసి సాధించుకున్నట్లు దళిత కైస్త్రవులు కూడా పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాస్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జాషువా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:21 AM