Share News

‘సర్‌’కు సన్నాహాలు

ABN , Publish Date - May 30 , 2026 | 01:17 AM

ఓటర్ల పూర్తి స్థాయి ధ్రువీకరణే లక్ష్యంగా జిల్లాలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన) నిర్వహణకు సంబంధించి సన్నాహాలకు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2002 నాటి ఓటరు జాబితాతో 2026 ఓటరు జాబితాను మ్యాపింగ్‌ చేయడంలో బీఎల్‌వోలు నిమగ్నమయ్యారు.

‘సర్‌’కు సన్నాహాలు

- జిల్లాలో కొనసాగుతున్న మ్యాపింగ్‌

- 2002, 2026 ఓటరు జాబితాలను పోలుస్తున్న బీఎల్‌వోలు

- జూన 15వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు

- ఆపై ఇంటింటి సర్వే ఓటర్ల జాబితా రూపకల్పన

- జిల్లాలో 7,27,807 మంది ఓటర్లు

జగిత్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల పూర్తి స్థాయి ధ్రువీకరణే లక్ష్యంగా జిల్లాలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన) నిర్వహణకు సంబంధించి సన్నాహాలకు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2002 నాటి ఓటరు జాబితాతో 2026 ఓటరు జాబితాను మ్యాపింగ్‌ చేయడంలో బీఎల్‌వోలు నిమగ్నమయ్యారు. ఇక ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేసేలా వచ్చే నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సన్నాహాక చర్యలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా జూన 25వ తేదీ నుంచి జులై 24వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటిటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధ్రువీకరించాక ముసాయిదా జాబితా సిద్ధం చేస్తారు.

- వేగంగా మ్యాపింగ్‌...

ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రస్తుతం బీఎల్‌వోల ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ చేపడుతున్నారు. 2002, 2026 జాబితా ఆధారంగా సరిపోల్చుతున్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీ ప్రతినిధుల పాత్రను కేవలం ఇళ్లు, వ్యక్తుల గుర్తింపునకు పరిమితం చేశారు. ఇది జూన రెండో వారం వరకు కొనసాగనుంది. అయితే ఓటర్లు మ్యాపింగ్‌ చేయించుకోవడంపై దృష్టిసారిస్తే ఓటు హక్కును కాపాడుకున్నట్లు అవుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మ్యాపింగ్‌ ద్వారా ఎన్యూమరేషన ఫామ్‌లో రెండు జాబితాల్లోని ఓటర్ల వివరాలు వస్తాయి. లేనిపక్షంలో ఒక జాబితా మాత్రమే వస్తుంది. తద్వారా 11 రకాల ధ్రువపత్రాలు సమర్పించి ఓటు హక్కు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

- సిబ్బందికి శిక్షణ..

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజనను ఎలా చేయాలనే అంశంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రక్రియపై బీఎల్‌వోలకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. ఎస్‌ఐఆర్‌ నిబంధనలు, విధివిధానాలను, క్షేత్రస్థాయి పరిశీలన, ఫారాల నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ఎస్‌ఐఆర్‌ పై ఇప్పటికే కలెక్టర్‌ సత్యప్రసాద్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై విధివిధానాలను వివరించారు.

- జిల్లాలో 7,27,807 మంది ఓటర్లు...

బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ అనంతరం వారు ప్రతీ ఇంట సర్వేను చేపట్టనున్నారు. జూన 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూతస్థాయి ఉద్యోగులు ఇంటింటా ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారు. ఈ క్రమంలో అర్హత కలిగిన ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. ఈ సర్వే ముగిశాక జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 7,27,807 మంది ఓటర్లున్నారు. ఇందులో 3,49,069 మంది పురుషులు, 3,78,699 మంది మహిళలు, 39 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు.

- అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం..

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, కొత్త క్లయిమ్‌లు, దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాక ఆమోదించాలా...వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లయిమ్‌ల స్వీకరించాక సెప్టెంబరు 28వ తేదీ వరకు వాటి పరిష్కారం చేపడుతారు. చివరగా తుది ఓటరు జాబితాను అక్టోబరు 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకుండా పర్యవేక్షించడమే కాక..ఎవరి పేరైనా జాబితాలో లేకపోతే అందుకు కారణాన్ని స్పష్టంగా తెలియజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - May 30 , 2026 | 01:17 AM