మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:50 AM
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. తుది ఓటర్ల జాబితాలో మునిగి తేలుతున్న అధికారులు పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్ చేస్తున్నారు.
- గుర్తులు ఖరారు చేసిన ఎన్నికల సంఘం
- రిజిష్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు 75 గుర్తులు
- గుర్తింపు పొందిన పార్టీలకు పార్టీ గుర్తులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. తుది ఓటర్ల జాబితాలో మునిగి తేలుతున్న అధికారులు పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్ చేస్తున్నారు. వార్డులు, డివిజన్ల వారీగా 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలను అనుసరించి రూపొందించిన ముసా యిదా ఓటర్ల జాబితాలను ఈ నెల ఒకటవ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన ఓటర్ల తుది జాబితాలను విడుదల చేయాల్సి ఉండగా, సవరణకు మరో రెండు రోజులు గడువు విధించారు. ఆ మేరకు జాబితాలను సవరించి ఈ నెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వెలువరిం చనున్నారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి పండుగ తర్వాత విడుదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. షెడ్యూల్ విడుదలకు ముందే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాలో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానా బాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 124 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. వార్డుల్లో 850 నుంచి 1500 మంది వరకు ఓటర్లు ఉండగా, డివిజన్లలో 2500 నుంచి 3 వేల వరకు ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 230కి పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశముంది. గతంలో నిర్వహించిన ఎన్నికల సందర్భంగా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారో, అక్కడే ఈ ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ స్టేషన్ల స్థితిగతులు, వసతుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కూడా మరికొన్ని చోట్ల పరిశీలిస్తున్నారు. నామినేషన్ల కేంద్రాల పరిశీలన కూడా చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో అనుబంధంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో జాతరలు జరగనున్నాయి. ఈ జాతరలకు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున జాతర అయిన తర్వాతనే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనబడుతున్నాయి.
ఫ గుర్తులు ఖరారు చేసిన ఎన్నికల సంఘం..
మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపైనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల గుర్తులతోపాటు రిజిష్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జాతీయ గుర్తింపు పొందిన పార్టీల్లో అమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు, బహుజన సమాజ్ వాది పార్టీ ఏనుగు, భారతీయ జనతా పార్టీ కమలం, సీపీఐ గుర్తు సుత్తె కొడవలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం, రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల్లో ఏఐఎంఐఎం పార్టీ గాలిపటం, భారత రాష్ట్ర సమితి గుర్తు కారు, తెలుగుదేశం పార్టీ సైకిల్, వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్ పంఖా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు సింహం, సీపీఎం గుర్తు కంకి కొడవలి, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు, ఇండియన్ యూని యన్ ముస్లిం లీగ్ పార్టీ గుర్తు నిచ్చెన. ఇవేగాకుండా 77 రిజిష్టర్డు పార్టీలు ఉన్నాయి. కానీ శాశ్వత పార్టీ గుర్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించ లేదు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆయా ఎన్నికల్లో సాధించాల్సిన ఓట్లను పొందలేక పోవడంతో ఆ పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించలేదు. ఆయా పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల సమయంలో బీ ఫారాలు సమర్పిం చినా కూడా అక్షర మాలను అనుసరించి స్వతంత్రులకు కేటాయించే గుర్తులను కేటాయించారు. వాటిలో ఎయిర్ కండిషనర్, ఆపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైనాక్యూలర్స్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారమ్ బోర్డు, చెయిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు సాసర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మిషన్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, కవర్, పిల్లనగ్రోవి, పుట్ బాల్, ఫుట్ బాల్ ఆటగాడు, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ పొయ్యి, గ్రామ్‌ఫోన్, ద్రాక్ష పండ్లు, పచ్చి మిరపకాయ, తోపుడు బండి, హెడ్ ఫోన్, హాకీ కర్ర బంతి, పనస పండు, బెండకాయ, పోస్టు డబ్బా, గొళ్లెం, లూడో, అగ్గి పెట్టె, మైక్, మూకుడు, ప్యాంటు, పెన్ డ్రైవ్, అనాస పండు, కుండ, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, సెఫ్టీ పిన్, కుట్టు యంత్రం, కత్తెర, నౌక, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెత స్కోప్, స్టూల్, స్విచ్ బోర్డు, టేబుల్, టెలిఫోన్, టూత్ బ్రష్, ట్రంపిట్, టైర్స్, వయోలిన్, వాల్ నట్, వాటర్ మెలోన్, బావి, ఈల, కిటికి, ఊలు మరియు సూది గుర్తులను కేటాయించారు. ఇందులో అభ్య ర్థులు తమకు ఇష్టమైనవి మూడు గుర్తులు సూచిస్తే, అక్షర మాలను బట్టి గుర్తులను కేటాయిస్తారు. వారి వరకు వచ్చే సరికి సూచించిన గుర్తులు ఎవరికి కేటాయించకుండా ఉంటే వాటిని కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 2,500 రూపాయలు, ఇతరులకు 5 వేల రూపాయల నామినేషన్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో కౌన్సి లర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు 1250 రూపాయలు, ఇతరులు 2,500 రూపాయలు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.