Share News

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:31 AM

యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా పౌరసరఫరాల శాఖ అధికా రులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. జిల్లాలో యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా పౌరసరఫరాల శాఖ అధికా రులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. జిల్లాలో యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.81 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వరికోతలకు సమయం అసన్నమ వుతున్న క్రమంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు యాసంగిలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ వరి పంటను దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు నీటి మట్టాలు తగ్గిపోవడంతో చివరి దశలో వరి పంటను దక్కించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరు అందక దిగుబడిపై రైతులు అందోళన చెందుతున్నారు. మరోవైపు వడగళ్ల వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు అందోళనలో ఉన్నారు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అందుకు అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

దిగుబడి అంచనా 4.56 లక్షల మెట్రిక్‌ టన్నులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజనల్‌లో 4.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. 4.49 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం ధాన్యం, 7,539 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందులో విత్తనాలకు 55,064 మెట్రిక్‌ టన్నులు వినియోగిస్తే, 1,01,600 మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ వారం నుంచి 25 వేల మెట్రిక్‌ టన్నులు, ఏప్రిల్‌లో 1.75 లక్షల మెట్రిక్‌ టన్నులు, మేలో 1.76 లక్షల మెట్రిక్‌ టన్నులు, జూన్‌లో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ మార్చిలో 10 వేలు , ఏప్రిల్‌లో 1.15 లక్షలు, మేలో 1.50 లక్షలు, జూన్‌లో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

ఫ 240 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా 240 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 159 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 73 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా ఒకటి, మెప్మా ద్వారా 7 కేంద్రాల ఏర్పాటుకు యాక్షన్‌ప్లాన్‌ రూపొం దించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించడానికి 3331807 గన్నీ బ్యాగులు అవసరం అవుతుండగా ప్రస్తుతం 2168193 అందు బాటులో ఉన్నాయి. ఇందులో కొత్తవి 1878070, ఇప్పటికే ఉపయోగించినవి 290123 లక్షలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోళ్ల కోసం టార్ఫాలిన్లు, ఇన్నోవింగ్‌ మిషన్లు , పాడీ క్లీనర్‌లు, మ్యాయిశ్చరైజ్‌ మీట ర్లు, వేయింగ్‌ మిషన్లు, అస్క్‌ రిమూవర్స్‌ , వంటి పరికాలు అందుబాటులో ఉంచారు.

జిల్లాలో వరి సాగు (ఎకరాల్లో)

మండలం వరి

గంభీరావుపేట 18700

ఇల్లంతకుంట 23500

ముస్తాబాద్‌ 21100

సిరిసిల్ల 4500

తంగళ్లపల్లి 20000

వీర్నపల్లి 7400

ఎల్లారెడ్డిపేట 18500

బోయినపల్లి 12600

చందుర్తి 15500

కోనరావుపేట 19200

రుద్రంగి 4770

వేములవాడ 5200

వేములవాడ రూరల్‌ 10950

--------------------------------------------------------------

మొత్తం 1,81,920

--------------------------------------------------------------

Updated Date - Mar 17 , 2026 | 01:31 AM