Share News

‘చేయూత’కు కసరత్తు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:23 AM

చేయూత పింఛన్లు అర్హులకు అందే విధంగా అధికారులు తుది కసరత్తు మొదలుపెట్టారు. దీపావళి కానుకగా ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసింది.

‘చేయూత’కు కసరత్తు

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

చేయూత పింఛన్లు అర్హులకు అందే విధంగా అధికారులు తుది కసరత్తు మొదలుపెట్టారు. దీపావళి కానుకగా ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసింది. అర్హులకు ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు అందే విధంగా ఆదేశాలిచ్చింది. 19వ తేదీ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ డబ్బులు జమకానున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను తేల్చి తుది జాబితా వెల్లడించే ప్రక్రియ జరుగుతుంది. బుధవారం కొత్త పింఛన్ల లెక్క తేలనున్నది. ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్ల కోసం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. దరఖాస్తుదారుల సమగ్ర సమాచారం ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్‌ మొబైల్‌ యాప్‌లో వివరాలను పొందుపరిచారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు , గ్రామపంచాయతీలో పరిధిలో అధికారులు ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి వివరాలు తెలుసుకున్నారు.. మూడు ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూములు, ఫోర్‌వీల్‌ వాహనాలు ఉన్నవారిని సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఆధార్‌, బ్యాంకు ఖాతా, ఫొటో అవసరమైన సర్టిఫికెట్లు, చేనేత, గీత కార్మికుల గుర్తింపు కార్డులు, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర వైద్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, మున్సిపల్‌ పరిధిలో రూ 2 లక్షల ఆదాయం దాటిన వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. సోషల్‌ ఆడిట్‌లో తప్పుడు ధ్రువీకరణ బయటపడితే వెరిఫికేషన్‌ అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు చెల్లించిన మొత్తం రికవరీ చేసే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన జరిపారు. ఎంపీడీవోలు, కమిషనర్లు ఆన్‌లైన్‌ చేసిన వాటిని జిల్లా ఉన్నత అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. జిల్లాలోని మండలాల్లో ఎంపీడీవోలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో కమిషనర్ల లాగిన్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన 11వ తేదీలోగా పూర్తి చేసి తుది జాబితా ఖరారు చేస్తారు. ఈసారి కొత్త జీవో ప్రకారం పింఛన్‌ దారులు చనిపోతే వెంటనే అతని భార్యకు పింఛను బదిలీ చేసి ఇవ్వన్నారు. గతంలో కేవలం వృద్ధాప్య పింఛన్‌ మాత్రమే బదిలీ ఉండేది. ఈ సారి అన్ని కేటగిరీల పింఛన్లు బదిలీ చేస్తారు.

ప్రజా ప్రతినిధుల పైరవీలు

ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ తర్వాత పింఛన్‌ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే బుధవారం వరకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను తేల్చి గురువారం నుంచి లబ్ధిదారులకు ప్రొసీడింగులు అందించే విధంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజాపత్రినిధులు, వివిధ పార్టీల నాయకులు తమ వారికి పింఛన్‌ అందే విధంగా అధికారులపై ఒత్తిడి చేస్తూ పైరవీలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అర్హులు అని తేల్చడం ఒక్క రోజే మిగిలి ఉండడంతో జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు కలుస్తూ తమ లాగిన్లలో అర్హులుగా నిర్ధారించాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఈసారి పారదర్శకంగా ముందుకు పోయే దిశగానే ఆన్‌లైన్‌ విధానం రావడం ద్వారా పకడ్బందీగా పరిశీలుస్తున్నారు. కొన్నిచోట్ల పింఛన్‌ మంజూరు కోసం అధికారులను బెదిరిస్తున్న తీరు కూడా ఉందని తెలుస్తోంది.

జిల్లాలో 9,649 చేయూత దరఖాస్తులు

జిల్లాలో గతంలో అభయహస్తం ద్వారా వచ్చిన 76,501 దరఖాస్తుల్లో చేయుత పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులోని అర్హులకు కూడా పింఛన్లు అందించే అవకాశం ఉంది. జిల్లాలో కొత్తగా పింఛన్ల కోసం 9,649 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వితంతువులు 4,127మంది, ఒంటరి మహిళలు 513 మంది, దివ్యాంగులు 2,271 మంది, చేనేత కార్మికులు 1,478 మంది, గీత కార్మికులు 1,260 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోయిన్‌పల్లి మండలంలో 646 దరఖాస్తులు, చందుర్తిలో 609, ఇల్లంతకుంటలో 784, కోనరావుపేటలో 746, ముస్తాబాద్‌లో 721, రుద్రంగిలో 217,సిరిసిల్ల మున్సిపాలిటీలో 2249, తంగళ్ళపల్లిలో 966,వీర్నపల్లిలో 170, వేములవాడలో 423, వేములవాడ రూరల్‌లో 386, వేములవాడ మున్సిపల్‌ 765, ఎల్లారెడ్డిపేటలో 633 దరఖాస్తు వచ్చాయి. వీటితో పాటు గతంలో జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు 1.92 లక్షలు ఉన్నాయి. ఇందులో పింఛన్ల కోసం 76,501 మంది దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు. పింఛన్‌ దరఖాస్తులను అధికారులు పకడ్బందీగా పరిశీలిస్తూ చేయూత వెరిఫికేషన్‌ మొబైల్‌ యాప్‌లో వివరాలు పొందపరిచారు.

సర్వేతో అనర్హుల గుర్తింపు

బడుగు, బలహీన వర్గాలకు జాతీయ, సాంఘిక భద్రత పథకం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్‌దారుల్లో మరణించిన వారికి సంబంధించిన పింఛన్‌ సొమ్ము కుటుంబ సభ్యులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వివిధ వృత్తులలో ఉన్నవారు పొందుతున్న చేయూత పింఛన్లలో అనర్హులను గుర్తించే దిశగా ప్రభుత్వం తాజాగా సజీవ నిర్ధారణ సర్వే లైవ్‌ అథెంటిఫికేషన్‌ నిర్వహించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రస్థాయిలో లైవ్‌ అథెంటిఫికేషన్‌ ద్వారా నిర్ధారణ సర్వేలో ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తి చేశారు. సర్వేలో మరణించిన వారు, స్థానికంగా ఆచూకీ లభించని పింఛన్‌ లబ్ధిదారులను గుర్తించారు. మృతి చెందిన వారి పింఛన్‌ లబ్ధిదారుల సొమ్ము నిలిపివేశారు. సర్వేలో 9,010 మంది అనర్హులుగా ఉన్నట్లు తేలుస్తుండగా, 2,836 మంది మృతి చెందిన వారు ఉన్నారు. జిల్లాలో చేయూత పథకంలో 1,08,986 వివిధ రకాల పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. సజీవ నిర్ధారణ సర్వేలో 99,976 మంది పింఛన్‌ లబ్ధిదారుల అర్హులగా ఉన్నారు. 2,836 మంది పింఛన్‌ లబ్ధిదారులు మృతి చెందినట్లు గుర్తించారు. వివిధ కారణాలతో పరిశీలనలో 9,010 పింఛన్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా కాని వారు 2,505మంది ఉన్నారు, నిర్ధారణ కానివి 1,441 మంది, స్థానింగా లేనివారు 564 మంది, ఆధార్‌ ధ్రువీకరణ సరిగా లేనివి 1,260 మంది ఉన్నారు.

జిల్లాలో కొత్తగా వచ్చిన దరఖాస్తులు

మండలం మొత్తం వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత

బోయిన్‌పల్లి 646 304 36 145 46 115

చందుర్తి 609 294 23 155 41 96

ఇల్లంతకుంట 784 379 45 212 09 139

గంభీరావుపేట 557 250 24 146 14 123

కోనరావుపేట 746 362 40 206 26 112

ముస్తాబాద్‌ 721 333 43 205 13 127

రుద్రంగి 217 125 18 38 09 27

సిరిసిల్ల మున్సిపల్‌ 2249 674 74 356 1072 73

తంగళ్ళపల్లి 966 350 53 226 198 139

వీర్నపల్లి 170 110 11 45 00 04

వేములవాడ 423 189 40 100 24 70

వేములవాడ రూరల్‌ 386 135 28 124 13 86

వేములవాడ మున్సిపల్‌ 765 390 68 175 58 74

ఎల్లారెడ్డిపేట 633 263 29 188 21 132

మొత్తం 9649 4127 513 2271 1478 1260

Updated Date - Nov 11 , 2026 | 01:23 AM