Share News

‘చేయూత’కు కసరత్తు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:40 AM

కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది.

‘చేయూత’కు కసరత్తు

జగిత్యాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. కొత్త పింఛన్ల మంజూరుకు ఈనెల 7వ తేదీన సీఈవో దివ్య దేవరాజన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి డీఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ, అర్హత, నిబంధనలు వివరించారు. ఆగస్టు15 నాటికి అర్హులను ఎంపిక చేసి సెప్టెంబరులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా ప్రస్తుతం జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2,19,480 మంది చేయూత పింఛన్‌దారులున్నారు.

ఫఫలించనున్న ఐదేళ్ల నిరీక్షణ..

జిల్లాలో వేలాది మంది చేయూత పింఛన్ల కోసం ఐదేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులతో పాటు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో ప్రజా పాలన, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారూ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్‌లోనే వివరాలు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు ఈకొత్త దరఖాస్తు ఫారానికి జత చేసి అందించాలనిని అంటున్నారు.

ఫ తర్వాత వృద్ధులు, బీడీ కార్మికులకు..

ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులున్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల కొరకు దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ వారికి తర్వాత దశలో ప్రాధాన్యం ఇస్తారని అధికారులు అంటున్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన అర్హులు నిరాశకు గురవుతున్నారు.

ఫ2022లో చివరి సారిగా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరిసారిగా 2022 అక్టోబరులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు దరఖాస్తుదారుల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. అయినా ఇప్పటి వరకు కొత్త వారికి పింఛన్లు మంజూరు కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీనిచ్చింది. దివ్యాంగుల పింఛన్‌ రూ.4,016 నుంచి రూ.6.016కు, ఇతర పింఛన్లు రూ.2,016 నుంచి రూ.4.016కు పెంచుతామని పలువురు నేతలు ప్రచారం చేశారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల మంజూరుకు జిల్లా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.

ఫఎక్కడ దరఖాస్తు చేయాలంటే..

గ్రామీణ ప్రాంతాల వారు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్‌డీవో ద్వారా కలెక్టర్‌ పరిశీలనకు పంపుతారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

అర్హులు సద్వినియోగం చేసుకోవాలి

-రఘువరన్‌, డీఆర్‌డీవో

ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు అవుతుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోనివారు ఉంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లాలో ప్రస్తుతం పింఛన్‌దారులు..

--------------------------------------------------------------

వృద్ధులు..57,959

వితంతువులు...43,322

దివ్యాంగులు...16,098

గీత కార్మికులు..3,334

చేనేత కార్మికులు...2,359

హెచ్‌ఐవీ బాధితులు..922

పైలేరియా బాధితులు..1,620

డయాలసిస్‌ బాధితులు..181

ఒంటరి మహిళలు...4,530

బీడీ వర్కర్లు...88,404

టేకేదార్లు...751

--------------------------------------------------------------

మొత్తం పింఛన్లు...2,19,480

--------------------------------------------------------------

Updated Date - Aug 12 , 2026 | 12:40 AM