‘చేయూత’కు కసరత్తు
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:12 AM
అర్హులైన వారికి ‘చేయూత’ పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారికి ‘చేయూత’ పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తాజా మార్గదర్శకాలతో అర్హులైన లబ్ధిదారుల జాబితాను త్వరగా రూపొందించి పంపించాలంటూ జిల్లా, మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో అధికారులు పింఛన్లకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. పంద్రాగస్టులోగా లబ్ధిదారులను ఎంపిక చేసి ‘చేయూత’ పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఫ ప్రాధాన్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక
కలెక్టర్, డీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులన్నింటిపై విచారణ జరిపి, అర్హులకు చేయూత పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రతిపాదనలను పంపించాలంటూ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక వైకల్యం ఉన్న పిల్లలు, మస్క్యులర్ డిస్ట్రోపీ, వెన్నుపాము సంబంధిత సమస్యలు, ఆటిజం, రక్త సంబంధిత రుగ్మతల వంటి నిర్ధిష్ట వైకల్యాలు ఉన్న దివ్యాంగులతోపాటు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకే పింఛన్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారికే వితంతువు, ఒంటరి మహిళలకు, 70 ఏళ్ళపైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేస్తూ ప్రతిపాదనలను తయారు చేసి పంపించాలని, 18 అంశాలతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను అధికారులకు పంపించారు.
ఫ దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు
ఐదేళ్లుగా వేల మంది వివిధ రకాల పింఛన్ల కోసం పలుమార్లు అధికారులకు దరఖాస్తులు సమర్పించి, కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు త్వరగా పంపించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా లక్ష మంది అర్హులైన వారికి చేయూత సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూడునెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయక పోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఫ అనర్హులు, చనిపోయిన వారి పింఛన్ల తొలగింపు
ఇప్పటి వరకు ఆసరా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు, చనిపోయిన వారిని గుర్తించి జిల్లాలో దాదాపు నాలుగు వేల మందిని తొలగించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో అనర్హులు, చనిపోయిన వారి పేర్లను తొలగించి వారి స్థానంలో కొత్తగా చేయూత పథకం ద్వారా సామాజిక భద్రత పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఫ ప్రాధాన్య కేటగిరిలో ఉన్న వారికే అవకాశం
వేలాదిగా వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకే తాజాగా ప్రాధాన్య కేటగిరీలతో ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంత మందికే పెన్షన్లు వస్తాయని, మిగిలిన వారికి నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 57 సంవత్సరాలు, అపై వయసు కలిగిన వారికి వృద్ధాప్య పెన్షన్లకు అర్హులుగా పేర్కొనగా 57 ఏళ్లు నిండినవారంతా దరఖాస్తులు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా వితంతు పెన్షన్లను మంజూరు చేయడంతో 40పైబడిన ఎంతో మంది అర్హులైన మహిళలు వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక దివ్యాంగులకు వారి అంగవైకల్యం బట్టి ఎంత శాతం ఉండాలనేది నిర్ధిష్టంగా పేర్కొన్నప్పటికి తాజాగా 70 శాతంపైబడి అంగవైక్యలం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడంతో తమను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమాల్లో కూడా అనేక మంది చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 38 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి 15 వేలపైచిలుకుమంది అర్జీలు పెట్టుకున్నారు. కొత్తగా మంజూరు చేసే లక్ష పింఛన్లలో ప్రాధాన్య కేటగిరీల్లో ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించింది. తాజా మార్గదర్శకాలతో తమకు పింఛన్ వస్తుందో లేదోనన్న ఆందోళన చెందుతున్నారు.