క్షేత్రస్థాయిలో పక్కాగా వివరాల నమోదు
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:06 AM
జిల్లాలో భూముల రీ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువా రం భూభారతి కింద భూముల రీసర్వే ప్రక్రియపై జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, జీపీవోలు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భూ భారతి కింద భూముల రీసర్వే ఉద్దేశం, ఉపయోగాలు, పాటించాల్సిన నిబంధ నలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వే కోసం జిల్లాలో 18 రోవర్ యం త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సర్వే కోసం ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వారు విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. భూముల రీ సర్వే రెవెన్యూ అధికారులు, లైసెన్డ్స్ సర్వేయర్ల బృందాలతో సర్వే చేయా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. రీ సర్వేలో భాగంగా ముందుగా గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని, రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, మొత్తం ప్రక్రియ తదితర అంశాలపై గ్రామస్తు లకు వివరించాలని సూచించారు. ఏ భూముల్లో సర్వే చేస్తారో వాటి వివరాలను ముందుగానే చేరవేయాలని తెలిపారు. జీపీవో, పంచాయతీ కార్యదర్శి సైతం సర్వేలో ఉండాలని వెల్లడించారు. ముందుగా గ్రామ సరిహద్దు సర్వే చేయాలని, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, అటవీ శాఖ తదితర శాఖల అధికారులకు సమాచారం అందజేయాలని, వారు సైతం సర్వేలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ను పరిరక్షించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాల ను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.