పక్కాగా సన్నాల లెక్క..
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:07 AM
సన్నరకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సన్నరకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ వానాకాలం సీజన్ నుంచి సన్నరకం వరి విత్తనాల కొనుగోలు దశ నుంచే రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సన్నరకం వరి సాగు జరుగుతుందో కచ్చితంగా గుర్తించేందుకు విత్తనాల విక్రయ సమయంలోనే డీలర్లు రైతుల వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవోలు) వద్ద ఉన్న పంటల నమోదుతో పూర్తిగా సరిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ మాత్రం వ్యత్యాసం ఉన్నా బోనస్ మంజూరులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డీలర్ల వద్ద కాకుండా గతంలో నిల్వ ఉంచుకున్న విత్తనాలతో సాగు చేసే రైతులకు కూడా అవకాశం కల్పించారు. అలాంటి రైతులు తమ పరిధిలోని ఏఈవో ద్వారా ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ వానా కాలం సీజన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన ఏడు సన్నరకం వరి రకాలకే బోనస్ వర్తించనుంది. వాటిలో తెలంగాణ (15048), సాంబమసూరి (బీపీటీ-5204), కేఎన్‌ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, ఎల్-44, టీజీ-7715 రకాలు ఉన్నాయి. ఆయా రకాల పంట కాలాన్ని కూడా వ్యవసాయ శాఖ నిర్ధారించింది.
ఫ రాష్ట్రంలో ఎక్కడ కొనుగోలు చేసినా నమోదు..
రైతులు రాష్ట్రంలోని ఏ జిల్లాలో విత్తనాలు కొనుగోలు చేసినా ఆ వివరాలు సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో సన్నరకం సాగు విస్తీర్ణంపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానున్నది. మండల, జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు డీలర్ల నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,95,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో అత్యధికంగా రైతులు సన్న రకాలనే సాగు చేస్తున్నారు. ఇందులో 1,45,000 ఎకరాల్లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నాలనే సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. అనంతరం ఏఈవోలు పంటల నమోదు సమయంలో వాటిని సరి చూసి అవసరమైన మార్పులు చేయవచ్చు.
ఫ నమోదు లేకుంటే బోనస్ లేదు..
ఆన్‌లైన్‌లో విత్తనాల కొనుగోలు నమోదు చేయని రైతులకు సన్న వరి బోనస్ వర్తించదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్లు సులభంగా లాగిన్ అయ్యేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. విత్తనాల విక్రయం సమయంలో రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, ప్యాకెట్ పరిమాణం, కొనుగోలు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ డిజిటల్ నమోదు ప్రక్రియ వానాకాలం సీజన్‌లో విక్రయించే విత్తనాలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా డీలర్లు నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది.