‘ప్రజావాణి’.. పట్టించుకునే వారేరీ..
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:34 AM
కక్కర్ల రాజయ్య సుందరగిరి గ్రామానికి చెందిన పేద రైతు.. ప్రభుత్వం ఎకరా పది గుంటల భూమి లావోణి పట్టాగా ఇచ్చింది.
- కలెక్టర్లు మారినా తీరని సమస్యలు
- ఆనవాయితీగా అర్జీల స్వీకరణ
- ఏటీఆర్ ఒక బ్రహ్మపదార్థం
- ఎకరం భూమి కోసం ఏడేళ్లుగా ప్రదక్షిణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కక్కర్ల రాజయ్య సుందరగిరి గ్రామానికి చెందిన పేద రైతు.. ప్రభుత్వం ఎకరా పది గుంటల భూమి లావోణి పట్టాగా ఇచ్చింది. దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2018 వరకు ఆ భూమికి రైతుబంధు డబ్బులు క్రమం తప్పకుండా అందుతూ వచ్చాయి. ఆ తర్వాత రైతుబంధు రాకపోవడంతో అనుమానం వచ్చి రెవెన్యూ అధికారులను విచారించాడు. సర్వే నంబరు 345 /బికి చెందిన ఎకరా పది గుంటల భూమి శ్రీధర్ అనే పేరుగల వ్యక్తి పేరిట మారింది. అందుకే రైతుబంధు సహాయం అందలేదు అంటూ రెవెన్యూ అధికారులు చెప్పారు. తాను లావోణిపట్టా భూమిని అమ్మకుండా ఎలా ఇతరుల పేరిట మారుతుంది అంటూ ఆయన ఎంత ప్రశ్నించినా జవాబు లేకపోవడంతో ఆర్‌టీఐ కింద వివరాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. దానికీ అధికారులు జవాబు ఇవ్వకపోవడంతో చేసేది లేక కోర్టులో కేసు వేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఐదుగురు కలెక్టర్లు మారారు. ప్రస్తుతం ఆరో కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 20 సార్లు ఆయన ప్రజావాణికి వచ్చి, ఆ భూమి సమస్య పరిష్కరించమని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయన నుంచి దరఖాస్తు తీసుకొని నంబరు ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. సుందరగిరి గ్రామానికి ఎనగందుల సంపత్, ఎనగందుల రాజయ్య అనే రైతుల పేరిట ఉన్న భూమి కూడా వేరే వారి పేరిట ఇలాగే మారింది. వారు కూడా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయానికి, కలెక్టర్ కార్యాలయానికి, ప్రజావాణికి వెళ్లి దరఖాస్తులు చేస్తూ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితం లేకపోవడంతో వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ మాజీ సర్పంచ్ వంతడపుల వెంకటస్వామి కలెక్టరేట్ ఎదుట సోమవార డప్పు కొట్టి నిరసన తెలిపారు. ప్రజావాణికి వచ్చిన అధికారులకు తన డప్పు చప్పుడైనా వినిపించి ఈ పేద రైతుల భూమి సమస్యకు పరిష్కారం లభించక పోతుందా అని ఈ మార్గాన్ని ఎంచుకున్నామని, ఇప్పటికైనా ఆర్డీవో, కలెక్టర్ అవసరమైన ఆదేశాలిచ్చి పేద రైతులకు న్యాయం చేయాలని వంతడపుల వెంకటస్వామి డిమాండ్ చేశారు.
ఫ యాక్షన్ టేకెన్ రిపోర్టు ఏది..?
ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం తప్పనిసరి తంతుగా నిర్వహిస్తున్నారే తప్ప ఆయాశాఖల అధికారులు అక్కడికి వచ్చిన ఫిర్యాదులను, దరఖాస్తులను సీరియస్‌గా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ఏయే శాఖకు చెందిన ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఏయే అధికారులు ప్రజావాణిలో పాల్గొని వాటిని స్వీకరించారు... అనే వివరాలను ఫొటోలతో సహా మీడియాకు పంపించడంలో చూపే శ్రద్ధ పరిష్కారం మీద చూపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఏ వారానికి ఆ వారం కాకున్నా నెలకొకసారైనా యాక్షన్ టేకెన్ రిపోర్టు కలెక్టర్ నుంచి వెలువడితే ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో ప్రజలకు తెలిసే అవకాశముంటుంది. అలాంటిదేమీలేక పోవడంతో అధికారులకు పట్టింపులేకుండా పోయింది. ఇప్పటికైనా ఆయా శాఖల నుంచి ఎప్పటికప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్టు తెప్పించుకొని ప్రకటించడమే కాకుండా సమస్య పరిష్కారమైతే అయ్యిందని, కాని పక్షంలో ఎందుకు కాలేదో దరఖాస్తుదారులకు తెలుపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకే సమస్యపై ఏడాదిగా తిరగడం ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారిందనడానికి నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.