Share News

విద్యుత్‌ కోతలు.. అన్నదాత వెతలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:11 AM

వానలు ముఖం చాటేశాయి.. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ నీరు అందడం లేదు..

విద్యుత్‌ కోతలు.. అన్నదాత వెతలు

జగిత్యాల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వానలు ముఖం చాటేశాయి.. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ నీరు అందడం లేదు.. భూగర్భజలాలు క్రమంగా పడిపోతున్నాయి.. ఉన్న కొద్దిపాటి నీటితో పంటను కాపాడుకుందామంటే విద్యుత్‌ కోతలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో బోర్లు, చెరువులు, కుంటలపై ఆధారపడి వానా కాలం సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పంటలకు అవసరమైన సమయంలో కరెంటు అందకపోవడంతో బోర్ల నుంచి నీరు తోడలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఫజిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు కలిపి 3.76 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా 2,92,860 ఎకరాల్లో వరి, 18,720 ఎకరాల్లో పత్తి, 38,910 ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 సబ్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 1.41 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి.

ఫసాగునీటికి కరంటే ఆధారం...

జిల్లాలో వానాకాలం సాగులో గణనీయమైన విస్తీర్ణం బోర్లు, చెరువులు, కుంటలపై ఆధారపడి ఉంది. సాధారణంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే రైతులకు కొంత ఊరట లభిస్తుంది. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. మరోవైపు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా సాగునీటి విడుదల లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యుత్‌ సరఫరా రైతులకు అత్యంత కీలకంగా మారింది.

ఫకరెంటు కోసం ఎదురుచూపులు..

పంటకు నీరు పెట్టాల్సిన సమయానికి విద్యుత్‌ సరఫరా లేకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితిలో రాత్రింబవళ్లు పొలాల వద్దే వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఒకవైపు కరెంటు కోత.. మరోవైపు బోర్లలో తగ్గుతున్న నీటిమట్టాలు.. ఇంకోవైపు వర్షాల కోసం ఎదురుచూపులు.. వెరసి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఇటీవల కోరుట్ల, కథలాపూర్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సాగుకు అవసరమైన మేరకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఫముందస్తు ప్రణాళిక లోపమేనా..?

విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే వ్యవసాయ సీజన్‌లో ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. సరఫరా విషయంలో ముందస్తు ప్రణాళిక లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను కనీసం 45 రోజులకు సరిపడా ముందుగానే అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో తగిన నిల్వలు లేకపోవడమే ప్రస్తుత ఇబ్బందులకు కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు

-రాజిరెడ్డి, రైతు, తిమ్మాపూర్‌ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం

విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నాం. నాకు తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. బావిలో నీరు ఉండడంతో సాగుకు ఉపక్రమించాను. విద్యుత్‌ కోతల వల్ల మోటార్లు నడవక, పొలాలకు నీరు అందడం లేదు. సమయపాలన లేకుండా విద్యుత్‌ తీసివేస్తున్నారు. దీనికి తోడు ట్రాన్స్‌ఫార్లర్లు కాలిపోవడం వల్ల ఇంకా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ప్రత్యేక దృష్టి సారిస్తాం

- సుదర్శన్‌, ఎస్‌ఈ, జగిత్యాల

వర్షాభావ పరిస్థితుల్లో బోరు మోటార్లే రైతుకు ప్రధాన ఆధారం. వ్యవసాయ ఫీడర్లపై నిరంతర పర్యవేక్షణ, ట్రిప్పులు, లో ఓల్టేజీ సమస్యలకు తక్షణ పరిష్కారం, పంట అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా అత్యవసరం. ఆయా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తాము.

జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు ఇలా..

-------------------------------------------------------------------------------

సెక్షన్‌ .. కనెక్షన్ల సంఖ్య

-------------------------------------------------------------------------------

జగిత్యాల టౌన్‌ - 12,863

జగిత్యాల రూరల్‌ - 18,782

ధర్మపురి - 17,954

మల్యాల - 14,462

గొల్లపల్లి - 16,341

మెట్‌పల్లి - 9,474

మల్లాపూర్‌ - 19,770

కోరుట్ల టౌన్‌ - 9,051

కోరుట్ల రూరల్‌ - 22,767

-------------------------------------------------------------------------------

మొత్తం - 1,41,464

-------------------------------------------------------------------------------

Updated Date - Sep 11 , 2026 | 02:11 AM