ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన కరువు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:42 AM
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు దరఖాస్తుదారులు పెద్దగా స్పందించడం లేదు.
జగిత్యాల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు దరఖాస్తుదారులు పెద్దగా స్పందించడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం-2020 కింద ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గత నెలాఖరుతో గడువు ముగిసినప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో చెల్లింపుదారులు ముందుకు రాలేదు. దరఖాస్తుదారుల్లో చాలా మంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, కొందరు ప్లాట్లు కూడా విక్రయించారు. దీంతో రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే అంతంతమాత్రంగానే ముందుకు వచ్చారు. ప్లాట్ల క్షేత్ర స్థాయి పరిశీలనలో జాప్యం, ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడం లేదంటున్నారు. గతంలో చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి ఫీజుల రూపంలో మరింత ఆదాయం సమకూరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఫరాయితీపై ప్రచారం అంతంతే...
ఎల్‌ఆర్‌ఎస్ కింద ఫీజు చెల్లింపును వేగవంతం చేయడానికి ప్రభుత్వం 2026 మే1 నుంచి జూలై 31వ తేదీ వరకు 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అవుతాయని అధికారులు భావించారు. అయితే గడువు ముగిసే సరికి ఆశించిన స్థాయిలో ఫీజుల చెల్లింపులు జరగలేదు. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేసింది. కానీ 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు వెనుకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడంతో చాలా మంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. ఫలితంగా ఫీజు గడువు ముగిసే సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూర లేదు.
ఫభారీ ఫీజులే అడ్డంకి..
ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తం కొంత మంది దరఖాస్తుదారులకు భారంగా మారినట్లు తెలుస్తోంది. రాయితీ ఉన్నప్పటికీ ఒకేసారి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి రావడంతో పలువురు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొన్ని దరఖాస్తులకు సంబంధించిన వివరాల పరిశీలన, భూముల స్థితిగతులు, డాక్యుమెంట్ల పరిశీలన వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడం కూడా చెల్లింపులు ఆలస్యం కావడానికి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఫీజు ఎంత చెల్లించాలి..? రాయితీ తర్వాత ఎంత మొత్తం అవుతుంది..? తదుపరి ప్రక్రియ ఏమిటనే విషయాలపై కొందరు దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది.
ఫమరో అవకాశం కల్పించేనా..?
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీ వర్తింప జేయడానికి ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పిస్తుందేమోనని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అవకాశం కల్పించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఫీజు చెల్లించని దరఖాస్తుదారులు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పిస్తే సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నారు. వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరోసారి ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
---------------------------------------------------------------------------------
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిస్థితి ఇలా..
---------------------------------------------------------------------------------
గ్రామ పంచాయతీల్లో...
దరఖాస్తుల సంఖ్య...11,514
ఆమోదించినవి...990
తిరస్కరించినవి...2
పెండింగ్‌లో ఉన్నవి...10,522
ఫీజు కలెక్షన్...రూ.5.73 కోట్లు
---------------------------------------------------------------------------------
మున్సిపాలిటీల్లో...
దరఖాస్తుల సంఖ్య...27,481
ఆమోదించినవి...2,466
తిరస్కరించినవి...444
పెండింగ్‌లో ఉన్నవి...24,571
ఫీజు కలెక్షన్...రూ.14.78 కోట్లు