కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:38 AM
‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంగా మలుచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిన కాళేశ్వరం ప్రాజెక్టునే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గురి పెట్టేందుకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంగా మలుచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిన కాళేశ్వరం ప్రాజెక్టునే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గురి పెట్టేందుకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది. రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షా భావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటిపై రైతుల్లో రోజు రోజుకు ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని గులాబీ పార్టీ నాయకులు రాజకీయ అవకాశంగా మలచుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగిపో వడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిన కారణంగానే దెబ్బతిన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశం బీఆర్‌ఎస్ పార్టీపై ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్‌ఎస్ పార్టీ సీట్లు కోల్పావాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కాళేశ్వరం అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఫ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతల దాడి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్ధ్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించకుండా రైతులపై వివక్ష చూపుతూ వారిని ఇబ్బం దులకు గురిచేస్తోందంటూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎదురు దాడి ప్రారంభించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమ వుతుండడం, సాగునీటి అవసరం పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం పంప్‌హౌస్‌లను వెంటనే ప్రారంభించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించగా, మాజీ మంత్రి టి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్నే ప్రధానంగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద ప్రాణహిత నది నుంచి లక్ష క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుందని, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుం దని, ప్రభుత్వం రాజకీయ కక్షతో రైతులను నీటికి దూరం చేస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌పై కక్ష సాధించేందుకే ఈ ప్రభుత్వం బ్యారేజీలకు మరమ్మతులు చేయ కుండా గోదావరిని ఎండ బెడుతున్నారని, రైతులను ఇబ్బందులను గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మోటార్లు ఆన్ చేయకుంటే లక్ష మంది రైతులతో కన్నెపల్లికి వచ్చి మోటార్లను ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ అంశం కనుమరుగు గాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధూకర్, కోరుకంటి చందర్‌లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు.
ఫ బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుదాడి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచా రాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, పార్టీ నాయకులు తీవ్రంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెంటవెంటనే మీడియా సమావేశాలు పెట్టి బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలను తిప్పి కొడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలే నేటి పరిస్థితికి కారణమని, నాణ్యతా ప్రమాణా లను విస్మరించి పంపులను నడపడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం ఆ బ్యారేజీని పక్కన బెట్టి గోదావరిపై మూడు బ్యారేజీలను నిర్మించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విమర్శిస్తున్నారు. తుమ్మిడిహెట్టి నిర్మించి ఉంటే వర్షాలు పడడం ఆలస్యమైనా, జూన్ మాసం నుంచే శ్రీపాద ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని, వచ్చిన నీళ్లను వచ్చినట్లే మిడ్ మానేరుకు ఎత్తిపోసే విధంగా ఆనాడు తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తే దానిని విస్మరించారని అంటున్నారు. తుమ్మిడిహెట్టి చేపడితే ఎక్కడ తమకు పేరు వస్తుందోననే బీఆర్‌ఎస్ దానిని నిర్మించలేదని విమర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అలాగే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆలస్యమైనా వర్షాలు పడతాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు కాళేశ్వరం వైఫల్యమే బీఆర్‌ఎ్‌స్ పార్టీకి రాజకీయంగా చేటు చేయగా ఇప్పుడు అదే కాళేశ్వరం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారే పరిస్థితులు కనిపిస్తు న్నాయని ప్రజల్లో చర్చ జరుగుతున్నది. సాగునీటి సమస్య మరింత తీవ్రమైతే రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు లేకపోలేదు. బీఆర్‌ఎస్ నాయకులు రోజురోజుకు దూకుడు పెంచుతుండడంతో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురు దాడికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరోసారి తెర మీదకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రాజకీయాలు తిరుగుతు న్నాయి. ఇది ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.