కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:00 AM
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం జరుగుతోంది.
జగిత్యాల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం జరుగుతోంది. విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ వివాదాస్పదంగా మారింది. నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం గరం గరంగా మారింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విద్యాలయ స్థల కేటాయింపుపై ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. స్థల కేటాయింపు సమయంలోనే కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం చోటుచేసుకుంటుండడంతో భవన నిర్మాణం, తరగతుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఫఎంపీ అర్వింద్ చొరవతో కేంద్రీయ విద్యాలయం మంజూరు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక చొరవ తీసుకొని పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో జగిత్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత యేడాది అక్టోబరులో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. దీంతో కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఫచల్‌గల్‌లో ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు..
జిల్లా కేంద్రానికి సమీపాన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చల్‌గల్ వాలంతరి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తొలుత ప్రతిపాదించారు. 5 ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే స్థల కేటాయింపు చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి జాప్యం చేస్తున్నారంటూ గతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను కలిసి కేంద్రీయ విద్యాలయం స్థల కేటాయింపు కోసం విజ్ఞప్తి చేస్తూ పలు పర్యాయాలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినప్పటికీ కేంద్రీయ విద్యాలయ స్థల సేకరణలో జాప్యం తొలగలేదు.
ఫ ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం..
కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు వ్యవహారంపై ఇటీవల ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇటీవల జగిత్యాలలో పర్యటించిన ఎంపీ కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. చల్‌గల్‌లో కాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం వేరే ప్రాంతంలో స్థల సేకరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డే స్కూల్‌గా బోధన జరిగే కేంద్రియ విద్యాలయం విద్యార్థుల రాకపోకలకు అనువుగా ఉండే చల్‌గల్‌లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం తీవ్రంగా స్పందించి ప్రత్యారోపణలు చేశారు. రాజకీయ స్వార్థంతో ఎంపీ తనపై ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. కేంద్రీయ విద్యాలయం స్థల కేటాయింపునకు నిస్వార్థంగా ప్రయత్నాలు చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఫతాజాగా ఇతర ప్రాంతాల్లో స్థల కేటాయింపునకు ప్రతిపాదనలు..
కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణానికి గత యేడాది అక్టోబరులో చల్‌గల్ వాలంతరీ స్థలం కేటాయింపు జరపాలని ప్రతిపాదించారు. అయితే సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించడానికి తీవ్ర జాప్యం ఏర్పడిందన్న కారణంతో ఇతర ప్రాంతాలను ప్రతిపాదించినట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు ఉపయోగంగా ఉన్న జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, అంబారీపేట్, నూకపల్లి శివారుల్లోని పలు ప్రభుత్వ స్థలాలను ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు. చల్‌గల్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థల కేటాయింపుకు ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది.
ఫముఖ్యమంత్రికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లేఖ...
జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణం చేయడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. చల్‌గల్ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయం భవనంతో పాటు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని కోరారు.
ఫప్రశ్నార్థకంగా మారిన పంటల పరిశోదన...
జగిత్యాల ప్రాంత రైతులకు వరి సాగుతో పాటు వివిధ రకాల పంటలు, పండ్ల తోటలు సాగు, నీటి నిర్వహణ పద్ధతులపై పరిశోధనలు చేయడానికి ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చల్‌గల్ వద్ద సుమారు 120 ఎకరాల వాలంతరీ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రానికి స్థలం కేటాయించారు. వాలంతరీలో వివిధ రకాల పంటల సాగు, తోటల సాగు జరిపి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల క్రితం జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని జిల్లా కేంద్రానికి సమీపంలో అందరికి సౌలభ్యం ఉంటుందనే సంకల్పంతో వాలంతరీ స్థలంలో మామిడి మార్కెట్ కోసం 25ఎకరాలు కేటాయించారని, వ్యవసాయ మార్కెట్ కోసం 5 ఎకరాలు, గోదాముల నిర్మాణానికి, రైల్వేలైన్ ఏర్పాటుకు 10 ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 25 ఎకరాలు వివిధ సందర్భాల్లో కేటాయించారు. ఎంపీ చొరవతో జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాలు, క్రీడా మైదానం నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. పంటల పరిశోధన కోసం కేటాయించిన స్థలాన్ని వివిధ అవసరాలకు కేటాయిస్తుండడంతో భవిష్యత్తులో పరిశోధన ప్రశ్నార్థకం అవుతుందని రైతాంగం ఆందోళన చెందుతోంది.
ఫతరగతుల ప్రారంభంపై నీలి నీడలు..
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, తరగతుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి భోదన జరిపేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే స్థల కేటాయింపులోనే వివాదం చోటుచేసుకోవడంతో తరగతుల ప్రారంభం, భవన నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాత్కలిక భవనంలోనైనా కేంద్రీయ విద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. విద్యాలయం ఏర్పాటుపై రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మానుకొని, వేగవంతంగా స్థల కేటాయింపు, భవన నిర్మాణం, విద్యార్థుల ప్రవేశాలు, తరగతుల ప్రారంభంపై ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం స్థల కేటాయింపులో జాప్యం
- ధర్మపురి అర్వింద్, ఎంపీ, నిజామాబాద్
కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపులో తీవ్ర జాప్యం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వార్థ ప్రయోజనాల కోసం స్థలాన్ని కేటాయింపు చేయించడం లేదు. డే స్కూల్ తరహాలో కేంద్రీయ విద్యాలయం నిర్వహించనుండడంతో అందరికీ అనుకూలమైన ప్రాంతంలో నిర్మాణం జరగాలి.
స్థలం కేటాయింపులో జాప్యం వల్లే కొత్త ప్రతిపాదనలు
- సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్ వద్ద గల వాలంతరీ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని కోరుతూ గతంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశాం. పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను స్థల కేటాయింపు జరపాలని కోరా. కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్థల కేటాయింపులో జాప్యం నెలకొంది. దీంతో ఇతర ప్రాంతాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేశాము.
ముఖ్యమంత్రి చొరవ చూపాలి
-జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి
జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపును చల్‌గల్‌లోని వాలంతరీ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో చేయాలి. ఈ మేరకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను రాశాను. ముఖ్యమంత్రి చొరవ చూపించి చల్‌గల్‌లోని వాలంతరీలో స్థలాన్ని కేటాయించాలి.