పొలిటికల్ వార్..
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:32 AM
బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ పదునెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఏడు రోజుల పాటు బీఆర్‌ఎస్ నేతలు కార్యక్రమాలు నిర్వహించారు.
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)
బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ పదునెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఏడు రోజుల పాటు బీఆర్‌ఎస్ నేతలు కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అంశంగా విజయోత్సవ ర్యాలీలతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం.. నిరసనలు.. ఆందోళన కొనసాగుతున్న క్రమంలోని రణరంగంగా మారిన అసెంబ్లీ వేడి రాజన్న సిరిసిల్ల జిల్లాకు తాకింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. మరోవైపు శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్ తీరును తప్పుపడుతూ ఢీ అంటే ఢీ అనే విధంగా కాంగ్రెస్ నాయకుల నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ వైఫల్యాల నిరసన కార్యక్రమాలతో పాటు అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నందుకు రాస్తారోకో, ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
దూకుడు పెంచిన బీఆర్‌ఎస్
కాంగ్రెస్ వైఫల్యాలను ఆయుధంగా జిల్లాలో మరోసారి బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టి అంబేద్కర్‌కు వినతిపత్రాలు అందించడంతో పాటు విభిన్న రీతిలో నిరసనలు ముగించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయడం, రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పులు నిర్వహించారు. ఇలా పలు కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షించే దిశగా, పార్టీ కేడర్ ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. దూకుడు పెంచిన క్రమంలోనే శాసనసభ సమావేశాల వద్ద తొలి రోజు రణరంగంగా మారిన క్రమంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ, ఇతర ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడంపై నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేశారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన నినాదాలతో హోరెత్తింది. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్దకు సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్ళపల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు తరలివచ్చారు. ఫ్లెక్సీలు తగలబెట్టే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణిలతోపాటు ముఖ్య గులాబీ శ్రేణుల ఢీ అంటే ఢీ అనే విధంగా ఆందోళన వెల్లువెత్తింది.
కాంగ్రెస్ ఎదురుదాడి.. దిష్టిబొమ్మల దహనం..
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలు తెలిపితే, కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెయ్యి రోజుల పాలన విజయోత్సవాలపై ర్యాలీలు నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రచారంలోకి తెచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల, వేములవాడలో వెయ్యి రోజుల విజయోత్సవాలపై సంక్షేమ పథకాలను తెలుపుతూ 500 అడుగుల ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నాయకుల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మధుపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గడిచిన వారం రోజులుగా పోటాపోటీగా జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎదురు దాడిని కొనసాగించింది. వెయ్యి రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
భగ్గుమంటున్న కాషాయ దళం
జిల్లాలో బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై నిరసనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్‌మెంట్‌అందించాలని, అర్హులైన వారికి పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ జిల్లా అధక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటానని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని నిరసనలు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను టార్గెట్‌తో బీజేపీ బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు.