పొలిటికల్ హీట్
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:41 AM
ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉదంతాలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
(ఆంద్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉదంతాలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. రెండు నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీ అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. దీంతో ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన తదనంతర పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఫ కాంగ్రెస్‌పై జీవన్‌రెడ్డి గుర్రు
నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంపుకునేందుకు మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి సిద్ధం కావడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు షాక్‌ను కలిగిస్తోంది. ఆరుసార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన జీవన్‌రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు జీవన్‌రెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం, అధికారిక పార్టీ సమావేశాలకు హాజరవుతుండడంతో జగిత్యాలలో జీవన్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గిపోయిందనే ప్రచారం మొదలైంది. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ప్రతిపక్షాల కంటే ముందు జీవన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయడం ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఆయన అసంతృప్తికి లోనైన ప్రతీసారి మంత్రులు, ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేతలు జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తూ వచ్చారు తప్ప ఆయనకు ప్రత్యామ్నాయ స్థానాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోకపోవడం మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతుండగా అసలు ఫిరాయింపులే జరుగలేదంటూ స్పీకర్ తీర్పునివ్వడం జీవన్‌రెడ్డిని మరింత అసంతృప్తికి గురిచేసింది. ఈ క్రమంలోనే మళ్లీ అసమ్మతి గళాన్ని బలంగా వినిపించడం ప్రారంభించారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్, పార్టీ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం జగిత్యాలకు వచ్చి జీవన్‌రెడ్డికి పార్టీ వీడవద్దని, పార్టీలో ఆయన ప్రాధాన్యం ఆయనకు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సాయంత్రం మరో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి కూడా జీవన్‌రెడ్డిని కలిసి అదే విషయమై చర్చించారు. అటు మంత్రులు, ఇటు పార్టీ నేతలు వచ్చి కలుస్తూ పార్టీని వీడవద్దని నచ్చజెప్పుతున్నారే కానీ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సానుకూల స్పందన లేకపోవడం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచన వైపే మొగ్గుచూపి ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. పార్టీ నేతలు ఎంత నచ్చజెప్పినా బుధవారం జగిత్యాలలోని బండారి ఫంక్షన్‌హాల్‌లో అనుచరులు, అభిమానుల, శ్రేయోభిలాషులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై ప్రకటించి, ఆ తర్వాత సన్నిహితులతో కలిసి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరే విషయాన్ని స్పష్టం చేయడం ఖాయమని తెలుస్తోంది.
ఫ ముగ్గురు మంత్రులున్నా......
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నా జీవన్‌రెడ్డిని బుజ్జగించడంలో విఫలమయ్యారని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. సామాజిక వర్గం కారణంతో పక్కనబెట్టినా తన సీనియార్టీని గుర్తించి ప్రాధాన్యం కల్పిస్తారనే ఆశాభావంతో వేచిచూస్తూ వచ్చారు. ఒకవైపు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ప్రోత్సహించడం, మరోవైపు తనకు ప్రాధాన్యాన్ని తగ్గించేలా పార్టీ నాయకత్వం వ్యవహరించడం వల్లనే జీవన్‌రెడ్డి పార్టీని వీడాలనే బలమైన నిర్ణయానికి వచ్చారని ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమనే సన్నిహితులు చెబుతున్నారు.
ఫ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్వయం కృతాపరాధం
హుజూరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి ఆది నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టుకోవడం, పార్టీ నాయకత్వం దానిని సరిదిద్ది నష్టనివారణకు పూనుకోవడం పరిపాటిగా మారింది. ఈసారి సొంత పార్టీ నుంచే అసమ్మతి గళం బలంగా వినిపించడం అధిష్ఠానాన్ని కూడా షాక్‌కు గురిచేసింది. నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలందరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం కావడం కలకలం రేపుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయనను మార్చి మరొకరిని నియమించకపోతే హుజూరాబాద్ నియోజవర్గంపై బీఆర్‌ఎస్ ఆశలు వదులు కోవలసిందేనని ఆయనను కొనసాగిస్తే పార్టీకి కూడా నష్టమేనని నియోజకవర్గ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు మూడు, నాలుగురోజుల్లో తేల్చిచెప్పాలని తమ సమావేశంలో నిర్ణయించుకోవడం పార్టీలో కలవరం కలిగిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే కౌశిక్‌రెడ్డి అసమ్మతి నేతలకు ఫోన్లు చేసి సర్ది చెప్పే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దీనికి కొందరు ఓకే అన్నా పలువురు అసమ్మతి నేతలు ససేమిరా అన్నట్లు సమాచారం. పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలమైన తమకు ప్రాధాన్యమివ్వకపోవడం, కొత్తగా వచ్చిన వారిని నెత్తిన పెట్టుకోవడం, సంబంధం లేని వ్యక్తిగత వ్యవహారాల్లో పార్టీని భాగస్వామ్యం చేయడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరుచూ వివాదాస్పద వాఖ్యలతో పార్టీని, నాయకత్వాన్ని ఇరుకునపెట్టడాన్ని సీనియర్ నేతలు తీవ్రంగా పరిగణించి వ్యవహారమంతా కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల గెలుపును పక్కనబెట్టి ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఈ సందర్భంగా అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ పరువు ఎమ్మెల్యే వైఖరితో బజారున పడుతోందని, ఈటల రాజేందర్ పార్టీలో ఉన్న హయాంలో ఉన్న గుర్తింపు ప్రజల్లో పలుకుబడి తగ్గిపోతుందని, దీనికి కౌశిక్‌రెడ్డే కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ఫ రంగంలోకి దిగిన కేటీఆర్
మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తమయ్యారు. కౌశిక్‌రెడ్డిని మందలించి వెంటనే పార్టీ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారని సమాచారం. దీంతో కౌశిక్‌రెడ్డి నియోజకవర్గ నేతలతో ఆదివారం చర్చలు జరిపి, ఫోన్లు చేసి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తంటాలు పడుతున్నారని తెలిసింది. ఈ పరిణామాలన్ని ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్ బలపడుతుందని అంచనా వేస్తున్న సమయంలో కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలి ఆపార్టీ నాయకత్వాన్ని ఇరుకునపెడుతోంది. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం ఏరకంగా వ్యవహరిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.