పిల్లల బంగారు భవితకు పోలియో చుక్కలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:29 AM
పిల్లల బంగారు భవిత కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన, జూన 28 (ఆంధ్రజ్యోతి): పిల్లల బంగారు భవిత కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రం సుందరయ్యనగర్ అర్బన పీహెచసీలో పోలియో వాక్సిన పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి చిన్నపిల్లలకు కలెక్టర్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పల్స్ పోలియో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పల్స్ పోలియో వ్యాక్సినను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. పోలియో రహిత దేశం కావాలంటే ఐదు సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని అన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తే భవిష్యత్తులో పోలియో బారినుంచి రక్షణ ఉంటుందని వివరించారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 41,147 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని వారందరికి జిల్లావ్యాప్తంగా 393 పోలియో చుక్కల బూతలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో సిబ్బంది పోలియో వ్యాక్సిన వేస్తారని మరో రెండు రోజుల తరువాత వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ చిన్న పిల్లలకు వ్యాక్సిన్స వేస్తారని అన్నారు. బాధ్యతగా తల్లిదండ్రులు తప్పకుండా పోలియో వ్యాక్సిన పిల్లలకు వేయించాలని సూచించారు. జిల్లా కేంద్రం మూడో వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన జిందం కళాచక్రపాణి పిల్లలకు పల్ప్ పోలియో చుక్కలను వేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర ఏంజెలా ఆల్ర్ఫెడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేంద్రబాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ చైర్‌పర్సన కళాచక్రపాణి, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషా, వైస్ చైర్మన దార్ల సందీప్, బీఆర్‌ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజ, ఆశావర్కర్లు, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.
హైరిస్క్ ప్రాంతాల్లో..
సిరిసిల్ల అర్బన/సిరిసిల్ల టౌన: హైరిస్క్ ప్రాంతాల్లో పిల్లందరికీ పల్స్ పోలియోను అందించడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ అన్నారు. సిరిసిల్ల అర్బన పరిధిలోని గుడిసెలు, ఇటుక బట్టీల వద్ద వలస కార్మికులు నివాస ప్రాంతాలు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, కార్మిక వాడల్లో అదివారం జిల్లా ఇమ్యూనైజేషన అధికారి డాక్టర్ సంపత, జిల్లా డేటా మేనేజర్ కార్తీక్‌లతో కలిసి జిల్లా వైద్యాధికారి ఏంజెలా అల్ర్ఫెడ్‌లు పర్యటించి పల్స్ పోలీయో పనితీరును పరిశీలించారు. రాజీవ్‌నగర్ శివారులోని గంగిరెద్దుల పిల్లలకు పోలీయోచక్కలను వేశారు. చంద్రంపేట గ్రామశివారులోని ఇటుకబట్టీలలో పర్యటించి వైద్యసిబ్బందితో అక్కడున్న కార్మికుల పిల్లందరికి పోలీయో చుక్కలను వేయించారు. ఈ సందర్భంగా రాజీవ్‌నగర్, చంద్రంపేటలలోని కార్మికుల కుటుంబాలతో జిల్లా వైధ్యాధికారి మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచవో మాట్లాడుతూ సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు సంవత్సరాలలోపు ఉన్న 41147 మంది చిన్నారులకు గాను 38678 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని 94 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. మిగిత పిల్లలకు రెండు రోజులలోపు గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయిస్తామన్నారు.