Share News

సర్కిల్‌ పరిధిలో పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేయాలి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:27 AM

ధర్మపురి సర్కిల్‌ పరిధిలో పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచించారు. ధర్మపురి పోలీస్‌స్టేషన, సర్కిల్‌ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సర్కిల్‌ పరిధిలో పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేయాలి
అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

ఎస్పీ అశోక్‌కుమార్‌

ధర్మపురి, జూన 13 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి సర్కిల్‌ పరిధిలో పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచించారు. ధర్మపురి పోలీస్‌స్టేషన, సర్కిల్‌ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్‌ పోలీస్‌ స్టేషనలోని రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కిల్‌ పరిధిలో నమోదు అవుతున్న కేసులు, అండర్‌ ఇన్వెస్టిగేషన ఉన్న కేసుల్లో ఉన్న సీడీ ఫైల్స్‌ను పెండింగ్‌ ట్రయల్‌లో ఉన్న సీడీ ఫైళ్లను ఆయన పరిశీలించారు. సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన సీఐ రాంనర్సింహారెడ్డికి సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌ స్టేషన పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్‌ నేరాలు, వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యం గురించి గ్రామాల్లో తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. నేరాల నియంత్రణలో విజిబుల్‌ పోలీసింగ్‌, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతీ కానిస్టేబుల్‌ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజలతో మమేకమై శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఎస్పీ వెంట జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐలు మహేష్‌, రవీందర్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:27 AM