ప్రజలకు సేవలో పోలీసులు ముందుండాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:52 PM
ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు ముందుండాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సీపీ శనివారం సందర్శించారు.
హుజూరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు ముందుండాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సీపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేస్ ప్రాపర్టీ భద్రత, రికార్డుల క్రమబద్దీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్టేషన్ పరిధిలోని అన్ని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ జాతీయ రహదారి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు సమీపంలో నేషనల్ హైవే-563పై ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్, టోల్ ప్లాజా అడ్మినిస్ర్టేషన్ బ్లాక్‌ను సీపీ గౌస్ ఆలం శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటి పనితీరు, నిఘా వ్యవస్థ, కంట్రోల్ రూమ్ ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడేందుకు గోల్డెన్ హవర్‌లో తక్షణమే స్పందించి, ఆస్పత్రులకు తరలించే సమన్వయ వ్యవస్థ పక్కాగా ఉండాలన్నారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ
కరీంనగర్ క్రైం: కరీంనగర్ వివేకానంద డిగ్రీ కళాశాల, హుజూరాబాద్‌లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలల్లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్-2 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను శనివారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.