పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:55 PM
నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. మహిళలు, చిన్నారులపై నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోక్సో, అత్యాచారం, మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో కోర్టు విచారణ పురోగతిని నిరంతరం సమీక్షించాలని అధికారులను సీపీ ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. వీలైనంత త్వరగా బాధితుల నగదు రికవరీ చేయాలని ఆదేశించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. నిందితులకు శిక్షలు సాధించడంలో కీలకంగా పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సేవలను గుర్తించి, వారికి సీపీ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. జూలైలో 15 ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్ విజయవంతంగా పనిచేసిందన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి శరత్ 6 కేసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం ప్రతాప్ 5, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎ రంజిత్‌కుమార్ 2, జి వీరస్వామి 2, గాయత్రి ఒక కేసులో నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించారని సీపీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి కృష్ణమూర్తి, పీపీ ఎం ప్రతాప్, అడిషనల్ పీపీ, అసిస్టెంట్ పీపీలు డి శరత్, కె జాన్సీ, లక్ష్మిప్రసాద్, శ్రీనివాస్, కుమారస్వామి, మంచికట్ల రాజేశం, రంజిత్, వీరస్వామి, రమ, ఉపేందర్, ఏసీపీలు శ్రీనివాస్, శ్రీనివాస్ జీ, వెంకటస్వామి, విజయ్‌కుమార్, మాధవి, సతీష్, యాదగిరి స్వామి పాల్గొన్నారు.