Share News

పేకాట జోరు..

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:26 AM

కరీంనగర్‌లో ‘పేకాట’ జోరుగా నడుస్తున్నది. పేకాట కేంద్రాల నిర్వాహకులకు కొందరు అధికారులు, నాయకుల అండదండ ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పేకాట జోరు..

- అనుమానం రాకుండా అపార్ట్‌మెంట్లు, అద్దె ఇళ్లలో నిర్వహణ

- పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరాల ఏర్పాటు

- రోజుకు రూ. లక్షల్లో లావాదేవీలు

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ‘పేకాట’ జోరుగా నడుస్తున్నది. పేకాట కేంద్రాల నిర్వాహకులకు కొందరు అధికారులు, నాయకుల అండదండ ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్స్‌, ఇళ్లు అద్దెకు తీసుకుని పేకాట సాగిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి దీర్ఘకాల సెలవుపెట్టి ఒక ఇంటిలో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పేకాట ఆడేవారికి సౌకర్యాలు కల్పిస్తూ.. ఒక్కో ఆటకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పేకాట కేంద్రాల నిర్వాహకులు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా పేకాట ఆడేవారికి మద్యం, భోజనం, సిగరెట్లు సమకూరుస్తూ అందుకు అదనంగా వసూలు చేస్తున్నారు.

ఫ రూ. 20 వేల వరకు గేమ్‌లు

కరీంనగర్‌లో 5 వేల రూపాయల నుంచి 10, 20 వేల రూపాయల వరకు రమ్మీ గేమ్‌లు నడుస్తున్నాయి. కొందరు ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు ఒక జట్టుగా కలిసి పేకాటలో పాల్గొంటున్నారు. జూదం నిర్వహిస్తున్న వారే ఫోన్‌ చేసి 10 మందిని పోగుచేసి ఆటను ప్రారంభిస్తున్నారు. కొత్తవారికి ప్రవేశం లేకుండా చూసుకుంటున్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా కొన్ని లాడ్జీలు, హోటళ్లలో కూడా పేకాట జోరుగా సాగుతోంది. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ను ఉపమోగిస్తుండబంతో డబ్బులు ఎక్కడా కనపడవు. పోలీసులు పట్టుకున్న సందర్భంలో డిజిటల్‌ పేమెంట్స్‌ వివరాలు తొలగిస్తున్నారు.

ఫ ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు

నగర శివార్లలోని కోళ్లఫాంలు, మామిడితోటలు పేకాటలకు అడ్డాలుగా మారాయి. పోలీసులు తనిఖీలకు వస్తే గమినించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. పేకాట స్థావరం ఉన్న ఇంటి చుట్టూ నిర్వాహకులు ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు వస్తుండగానే ఆ సమాచారం ఫోన్లలో నిర్వాహకులకు తెలుస్తుంది. వాళ్లు జాగ్రత్త పడతారు.

ఫ ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు..

జూద వ్యసనంగా మారిన కొందరు నిత్యం పేకాట ఆడుతూ తమ ఆస్తులను కోల్పోతున్నారు. గతంలో పేకాటతో ఆర్థికంగా దివాళాతీసి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన ఒక వ్యాపారి పేకాట కోసం పలువురి వద్ద దాదాపు 50 లక్షలు అప్పు చేశాడు. ఈ అప్పులు చెల్లించలేని పిరిస్థితిలో హైదరాబాద్‌లోని ఒక లాడ్జిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన మరొక వ్యాపారి జూదం వ్యసనంగా మారి తన వ్యాపారంపై దృష్టిపెట్టలేక నష్టాలు రావటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరానికి చెందిన పలువురు మద్యతరగతికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు కూడా పేకాట వ్యసనపరులుగా మారి ఆస్తులను తెగనమ్ముకుంటూ దివాళా తీస్తున్నారు. ఈ పేకాట వ్యసనం నుంచి దూరం చేసేందుకు పోలీసులు తరచుగా తనిఖిలు నిర్వహించాలని, పట్టుబడిన సందర్భాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ గత మూడు సంవత్సరాల్లో పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా పేకాట, మట్కా ఆడుతూ 1,433 మంది పోలీసులకు చిక్కారు. వీరిపై 201 ఎఫ్‌ఐఆర్‌లతోపాటు 24 పెట్టీ కేసులు నమోదయ్యాయి. జూదరుల నుంచి 44,76,620 రూపాయలు పోలీసులు సీజ్‌ చేసి కోర్టుకు స్వాధీనం చేశారు.

శాస్త్రవేత్తలను స్పూర్తిగా తీసుకొని భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలి

- జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, డీఈవో అశ్వినితానాజీ వాకడే

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శాస్త్రవేత్తల కృషిని స్పూర్తిగా తీసుకొని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సులో మంచి పట్టుసాధించి భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, డీఈవో అశ్వినితానాజీ వాకడే విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరమ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమిరిశెట్టి దామోదర్‌, వి.రాంకిరణ్‌ కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లా సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహించారు. విద్యార్థుల్లో నిగూడంగా ఉండే ప్రతిభాపాటవాలను వెలికితీసే సదుద్దేశంతో, సైంటిఫిక్‌ టెంపర్‌ పెంచే సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, మంచి అలవాట్లతో తరగతి గదిలో చదువుకొన్న అంశాలను శాస్త్రీయ ధృక్పతాన్ని పెంపొందించుకకోవాలని సూచించారు. విద్యార్తులతో, ఉపాధ్యాయులతో భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలకి సంబంధించి అనేక అంశాలను అడిగి సంతృప్తి వ్యక్తం చేవారు. ఈకార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జిల్లా మ్యూజియం నుంచి సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతపౌరులుగా ఎదగాలని సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. టాలెంట్‌ టెస్ట్‌లో ఎంపికైన మొదటి, రెండు స్థానాల్లో నిలిచి విద్యార్థులకు మెమోంటోలు ప్రదానం చేశారు. కరీంనగర్‌ నుండి ప్రథమ స్థానం కనపర్తి సుశాంత్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ జంగపల్లి), ద్వితీయ స్థానం భూంపల్లి కీర్తి (జడ్పీహెచ్‌ఎస్‌ జంగపల్లి), తృతీయ స్థానం కోమటిరెడ్డి ఆదిత్య (ఇజిఎంఎస్‌ ఎలగందల్‌)కి మెమోంటోలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ మిలకూరి శ్రీనివాస్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, ఫోరం ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ బాధ్యులు నాగుల భజన్‌ చందర్‌, నలుమాచు చంద్రశేఖర్‌, కామిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి, గైడ్‌ టీచర్స్‌ గోరంటాల ఆనందం, ఎండి. మునీరొద్దీన్‌, 32 పాఠశాలల గైడ్‌ టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:26 AM