Share News

ఇసుక దోపిడీకి ప్రణాళిక

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:34 AM

జిల్లాలో కమర్షియల్‌ అవసరాలకు టీఎస్‌ఎండీసీ (తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా గాకుండా స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఇసుకను సరఫరా చేసి ప్రభుత్వానికి సుమారు 100 కోట్ల రూపాయల ఆదా యానికి గండి కొట్టేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం.

 ఇసుక దోపిడీకి ప్రణాళిక

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కమర్షియల్‌ అవసరాలకు టీఎస్‌ఎండీసీ (తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా గాకుండా స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఇసుకను సరఫరా చేసి ప్రభుత్వానికి సుమారు 100 కోట్ల రూపాయల ఆదా యానికి గండి కొట్టేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. పెద్దంపేట వద్ద గోదావరిలో గుర్తించిన ఇసుక రీచ్‌ నుంచి ఇసుక తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మానేరు, గోదావరి నదులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్థానిక అవసరాల కోసం స్యాండ్‌ ట్యాక్సీ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుంటే ఒకటి, రెండు రోజుల్లో ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేసే విధానాన్ని అమలు చేశారు. మానేరుపై టీఎస్‌ఎండీసీ ద్వారా కూడా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి కమర్షియల్‌గా ఇసుక విక్రయాలు జరిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తోడుతున్నారని కొందరు చెన్నై గ్రీన్‌ ట్యిబ్యూనల్‌ ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో ఇసుక రీచులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరల ఇసుక రీచులు నడిపించేందుకు అనుమతులు వచ్చాయి. కరీంనగర్‌ వైపునకు ఇసుక రీచులు నడుస్తున్నప్పటికీ, జిల్లాలో ఇసుక రీచులు నడవనీయకుండా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంతో రీచులు ఓపెన్‌ కాలేదు. అలాగే స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా గాకుండా స్థానిక ప్రజల అవసరాల కోసం ఉచితంగానే ఇసుక తీసుక వెళ్లేందుకు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అధికారులు అనుమతించారు. ఇదే అదునుగా కొందరు ఇసుకాసురులు గుట్టుచప్పుడుగా హైదరాబాద్‌, ఇతర జిల్లాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక డంపులను, ఇసుక తరలించే వాహనాలను పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు.

ఎన్టీపీసీలో నిర్మాణం జరగనున్న టీఎస్‌టీపీపీ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను టీఎస్‌ఎండీసీ ద్వారా గాకుండా స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా తీసుకునేందుకు అనుమతించాలని అధికారుల మీద ఒత్తిడి తీసుక వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తీసుకున్నట్లయితే టన్ను ఇసుకకు 375 రూపాయల ఆదాయం వస్తుంది. స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా తీసుకుంటే టన్నుకు 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. స్యాండ్‌ ట్యాక్సీని కేవలం స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ దాని ద్వారా కమర్షియల్‌ అవసరాలకు ఇసుకను తరలించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు మొదటి దశలో రెండు 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో దశలో మూడు 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణం చేపడుతున్నది. ఇది పూర్తి కావడానికి ఎనిమిదేళ్లు పట్టనున్నది. ఈ నిర్మాణ పనులకు సుమారు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం అని గుర్తించారు. ప్రభుత్వం తరపున చేపట్టే నిర్మాణాలకు, ఇతర కమర్షియల్‌ నిర్మాణాలకు టీఎస్‌ఎండీసీ ద్వారానే ఇసుక తీసుకోవాలనే నిబంధనలున్నాయి. టీఎస్‌టీపీపీ నిర్మాణ పనుల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పెద్దంపేట్‌ సమీపంలోని గోదావరిలో ఇసుక లభ్యతపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా శాఖల అఽధికారులు జాయింట్‌ సర్వే చేశారు. అక్కడ 1,01,200 క్యూబిక్‌ మీటర్ల ఇసుక లభ్యత ఉన్నట్లు సంబంధిత అధికారులు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ రీచును స్యాండ్‌ ట్యాక్సీ కింద వినియోగించుకుని టీఎస్‌టీపీపీ పనులకు వినియోగించుకోవాలని కొందరు ప్రణాళిక రచించినట్లు సమాచారం. టీఎస్‌ఎండీసీ ఒక టన్ను ఇసుకను 375 రూపాయలు వసూలు చేస్తారు. స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య ఒక టన్నుకు 325 రూపాయల వ్యత్యాసం ఉంటుంది. టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తీసుకుంటే 30 లక్షల టన్నులకు 112 కోట్ల 50 లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుండగా, స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా అయితే కేవలం 12 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. సుమారు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు అధికారులపై కొందరు ఒత్తిడి తీసుక వస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టీఎస్‌ఎండీసీ డైరెక్టర్‌ జిల్లా అధికారికి ఫోన్‌ చేసి కమర్షియల్‌ అవసరాలకు టీఎస్‌ఎండీసీ ద్వారానే ఇసుక వాడాలని, స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా అనుమతులు ఇవ్వవద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గనులు, భూగర్భ శాఖ, టీఎస్‌ఎండీసీ అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడ నడుస్తున్నాయి, వాటి అవసరాలకు ఎంత పరిమాణంలో ఇసుక అవసరమో అంచనాలు తీసుకుని, ఆ ఇసుకను టీఎస్‌ఎండీసీ ద్వారానే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. టీఎస్‌టీపీపీ పనులకు స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఇసుకను తరలించాలని అధికారులపై ఒత్తిళ్లు తీసుక వస్తున్నట్ల్లు ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారులు దీనిపై ఎలా ముందుకు వెళాతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Jan 03 , 2026 | 12:34 AM