వరిలో తెగుళ్ల బెడద
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:03 AM
ప్రస్తుతం వరిలో తెగుళ్ల బెడద రైతులను ఆందోళన రేకెత్తిస్తోంది.
- అన్నదాతల్లో ఆందోళన
- నివారణ చర్యలు చేపట్టాలంటున్న వ్యవసాయశాఖ అధికారులు
చొప్పదండి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వరిలో తెగుళ్ల బెడద రైతులను ఆందోళన రేకెత్తిస్తోంది. వరిపైర్లన్నీ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. వరి కంకులన్నీ ధాన్యపు గింజలుగా మారే తరుణంలో పలు చోట్ల పంటలకు చీడ పీడలు, తెగుళ్లు సోకాయి. ఈ నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుని పంట నష్టపోకుండా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వరి పొలాల్లో మొగి పురుగు, కంకినల్లి ఉధృతి కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో మెడ విరుపు, దోమపోటు కూడా సోకే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రైతుల కోసం పలు సూచనలు..
- కంకినల్లి..
వరి పైరులు రైతులు కంకినల్లి లక్షణాలను గుర్తించవచ్చు. వరి ఆకుల తొడిమ మీద గోధుమ రంగు గీతలు కనిపిస్తాయి. ఆకు తొడిమ తెరిస్తే చిన్న, తెల్లటి నల్లి లాంటి పురుగులు కనిపిస్తాయి. నల్లి ఆశించిన కంకిలో గింజలు నల్లబడిపోయి తాలుగా మారుతాయి. వరిలో కంకి ఏర్పడే ప్రస్తుత దశలోనే లీటర్ నీటికి స్పైరోమెసిఫెన్ 1 మిలీ లీటర్ మందును కలిపి పిచికారి చేయాలి. లేదా డయాఫెన్ ధయూరన్ 50 ఒక గ్రాము పొడి మందు లీటరు నీటికి కలిపి పిచికారి చేసి కంకినల్లిని నివారించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరిన్ని సూచనలకు వ్యవసాయ అధికారిని కలిసి నివారణ చర్యలు చేపట్టవచ్చు.
- మొగి పురుగు..
వరి ఆకుల మీద మొగి పురుగు గుడ్లు పెడుతుంది. గుడ్డు కాస్త 15 రోజుల్లో సన్నని బియ్యం మాదిరిగా పురుగుగా మారుతుంది. వరికాండం మొదట్లో మొగిపురుగు చొరబడి అందులోని గుజ్జును తింటుంది. కాండం నుంచి వరి కంకికి పత్రహరితం సరఫరా కాక వరికంకి తెల్లబడిపోయి తాలుగా మారుతుంది. 30 శాతం నుంచి 40 శాతం వరకు పంట నష్టం జరుగుతుంది. మొగి పురుగు నివారణకు కాంటాఫ్ హైడ్రో క్లోరైడ్ 50సి మందును ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారి చేసుకోవాలి. దీంతోపాటు వేపనూనెను కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- మెడ విరుపు..
వరి కంకి పాలుపోసుకునే దశలో కంకి వెన్ను దగ్గర నల్లని శిలీంధ్రం ఏర్పడి పత్ర హరితాన్ని వరి గొలుసుకు సరఫరా కాకుండా నిలిచిపోతుంది. తద్వారా వరి గొలుసు విరిగిపోయి తాలుగా మారుతుంది. పంట నష్టం భారీగా జరుగుతుంది. మెడ విరుపు నివారణకు కాసుగామైసిన్ మందును ఎకరానికి 400 మిల్లీ లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాలి.
- దోమ పోటు..
వరి కాండం మొదట్లో గోధుమ, తెలుపు రంగులో ఉండే రసం పీల్చే పురుగులు ఉంటే దోమపోటుగా గుర్తించవచ్చు. దీనిని రైతులు వెంటనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమపోటు సోకిన పొలం నుంచి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి. పొలాన్ని వీలైనంత ఆరబెట్టాలి. దోమపోటు సోకిన తర్వాత వరికాండం నుంచి గొలుసుకు పత్ర హరితం సరఫరా కాక ధాన్యపు గింజలు తాలుగా మారుతాయి. పురుగులు వరికాండం వద్ద రసం పీల్చిన తర్వాత వరికంకులు ఎండిపోతాయి. వీటి నివారణకు పైమెట్రోజిన్ 50 శాతం మందు ఎకరానికి 120 గ్రాముల చొప్పున ఉదయం లేదా సాయంత్రం పిచికారి చేసుకోవాలి. సరైన సమయంలో రైతులు ఈ తెగుళ్లను గుర్తించి పంట నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.