Share News

ధర్మపురి క్షేత్రాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:53 PM

ధర్మపురి క్షేత్రాభివృద్ధికి అన్నివర్గాల ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

ధర్మపురి క్షేత్రాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
సమీక్ష సమావేశంలో మాట్లాడతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

- గోదావరి పుష్కరాల భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, జూన 5 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రాభివృద్ధికి అన్నివర్గాల ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురి దేవస్థానం ఈవో కార్యాలయంలో క్షేత్రాభివృద్ధి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్‌, అధికారులు, భూనిర్వాసితులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ భూనిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు. ధర్మపురి క్షేత్రాభివృద్ధి కోసం భూనిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. భూనిర్వాసితులతో నెలలుగా చర్చలు జరిపామని, మరో దఫా చర్చలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ధర్మపురి క్షేత్రాభివృద్ధి కోసం స్థానికులు సహకరించాలని, ఎవరు కూడా క్షేత్రాభివృద్ధిలో రాజకీయాలు చేయవద్దని కోరారు. అభివృద్ధి కోసం సేకరించే భూములు, ఇళ్లు కోల్పోతున్న వారందరు పెద్ద మనసుతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం మొదటి విడతగా నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాలకు రూ. 117 కోట్లు సీఎం రేవంతరెడ్డి కేటాయించారని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బైపాస్‌ రోడ్డు, పార్కింగ్‌ స్థలాలు, పుష్కర స్నానఘట్టాలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. మరిన్ని సౌకర్యాల కోసం కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే నిధులు సాధించి పుష్కరాలకు ముందే పనులు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అనంతరం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భూనిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ధర్మపురి ఆలయ అభివృద్ధికి పనులు చేపడుతామని అన్నారు. గోదావరి పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల ఆర్డీవో మధుసూదన, ఎండోమెంట్‌ కరీంనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాయిని సుప్రియ, ధర్మపురి ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన వేముల నాగలక్ష్మి, ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన జక్కు రవీందర్‌, తహసీల్దార్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావు, ఇరిగేషన, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:53 PM