Share News

జవాబుదారీతనంతో ప్రజాపాలన..

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:33 AM

ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా.. జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పోలీస్‌పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విప్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి.

జవాబుదారీతనంతో ప్రజాపాలన..

- వీటీడీఏకి రూ.390 కోట్లు మంజూరు

- జిల్లాలో వస్త్రపరిశ్రమ కార్మికులకు చేతినిండా పని

- రేషన్‌ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులో పంపిణీ

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా.. జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పోలీస్‌పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విప్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వివిధశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఉత్తమంగా సేవలందిస్తున్న వారికి ప్రశంసాపత్రాలను కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి6నుంచి జూన్‌ 12వతేదీ వరకు ప్రజాపాలన- ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యాచరణ చేపట్టిం దన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక కింద 10 ప్రధానఅంశాలలో కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో 496ఫైళ్లను క్లియర్‌ చేశామన్నారు.

వీటీడీఏకు రూ.390 కోట్లు మంజూరు..

వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ(వీటీడీఏ)కి ఇప్పటివరకు రూ.390కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు రూ.111.25కోటతో చేపట్టగా వివిధదశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.12కోట్లతో చేపట్టిన గుడిచెరువు బండ్‌ పార్కును ఇటీవలే ప్రారంభించామన్నారు. గుడిచెరువులో బోటింగ్‌ కోసం రూ.1.40కోట్లు మంజూరు కాగా, టెండర్‌ ప్రక్రియ తుదిదశకు చేరుకుందని తెలిపారు. భీమేశ్వరస్వామి ఆలయం రూ.6కోట్లతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయించామన్నారు.

వస్త్ర పరిశ్రమలో కార్మికులకు చేతినిండా పని..

జిల్లాలో వస్త్ర పరిశ్రమలో కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులకు ప్రజాప్రభుత్వం చేతి నిండా పని కల్పించడానికి చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిణీ చేసేందుకు 6కోట్ల 86లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్‌ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించామని అన్నారు. ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్‌ మొదటి విడతగా 4కోట్ల 70లక్షల మీటర్ల ఆర్డర్‌ జిల్లాలోని 133మ్యాక్స్‌ సంఘాలకు కేటాయించామని అన్నారు. దీనిద్వారా 6వేల మంది కార్మికులకు ఉపాధి కలుగుతుందని అన్నారు. స్కూల్‌ యూనిఫాం కోసం 30లక్షల 31వేల మీటర్ల వస్త్రాన్ని మ్యాక్స్‌ సంఘాల ద్వారా కొనుగోలు చేశామని అన్నారు. నేతన్నకు పొదుపు పథకం కింద జిల్లాలోని 4963మంది మరమగ్గాల కార్మికులకు రూ 12.40కోట్లను ప్రభుత్వ వాటా కింద విడుదల చేశామని అన్నారు. నేతన్న భద్రత పథకం కింద ఇప్పటివరకు అకాల మరణం చెందిన మరమగ్గాల, చేనేత రంగాలకు సంబంధించిన 132మంది కార్మిక కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున 6.60కోట్లు అందజేశామని తెలిపారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో రూ.159.59కోట్లు

జిల్లాలో ఇప్పటివరకు 5925ఇండ్లకు నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా 3759గృహాల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు దశల వారీగా రూ 159.59 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి 3500చొప్పున అలాగే శ్రీరాజరాజేశ్వర జలా శయం ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎస్‌ఆర్‌క్యూ కోటా కింద కలిపి 9086ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

జిల్లాలో 24వేల 174కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేశామని, జిల్లాలోని లక్షా95వేల915 రేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాలకు స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. నూతన స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ శనివారం నుంచి మొదలైందని తెలిపారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 195915 కుటుంబాల బ్యాంక్‌ ఖాతాల్లో 11.51కోట్లు సబ్సిడీసొమ్ము జమ చేశామన్నారు. యాసంగి సీజన్‌లో 3లక్షల 75వేల 976మెట్రిక్‌ టన్నుల ధాన్యం 53వేల 704మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని అన్నారు.

జిల్లాలో రూ.16.70కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం

జిల్లా కేంద్రంలో రూ.5కోట్లతో చేపట్టిన ఇందిరా మహిళాశక్తి జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోగా, ప్రారంభానికి సిద్ధం చేశామని శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో 167గ్రామాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాల పనులు రూ16.70కోట్లతో చేపట్టగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. జిల్లాలోని 12మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇప్పించి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. మెప్మా అధ్వర్యంలో 91మహిళా సంఘాలకు రూ 12.65కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించామన్నారు. వేములవాడలో రాజరాజేశ్వర దేవి మహిళా సంఘం ద్వారా ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించామని అన్నారు.

పురోగతిలో నీటిపారుదల పనులు..

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఇతర నీటి పారుదల పనులు పురోగతిలో ఉన్నాయని శ్రీనివాస్‌ తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ స్టేజీ -2, ఫేజ్‌- 1లో రుద్రంగి చెరువు (కలికోట సూరమ్మ చెరువు) అలాగే మర్రిపల్లి చెరువుల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

ఎల్‌నినో అధిగమించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి ఇబ్బందులను ఎదుర్కునేందుకు వర్షం నీటిని ఒడిసిపట్టి, భూగర్భజలాల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణ జలసిరి కింద కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా బోర్‌ వెల్‌ రీచార్జ్‌, ఇంకుడు గుంతలు, ఫాం పాండ్స్‌, రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాల లక్ష్యంగా 82వేల 702కాగా, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో లక్ష27వేల 884 మంది రైతులకు రూ.149.32 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, 460492మంది రైతులకు రూ 370.75 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య..

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్‌స్థాయి విద్యను అందించేందుకు వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మూడపల్లిలో రూ.200కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల, కోనరావుపేటలోని మోడల్‌ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌గా తీర్చిదిద్దేందుకు రూ.66కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 13పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా మరో 48 ఈ ఏడాది మంజూరు వచ్చిందని తెలిపారు.

మున్సిపాలిటీలో అభివృద్ధి ప్రణాళికలు

జిల్లాలోని వేములవాడలో రూ.80లక్షలతో 60వీధి వ్యాపారుల దుకాణ సముదాయాల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.10.90 కోట్లతో ఆర్‌సీసీ పైప్‌డ్రైన్‌, సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రూ.2.65 కోట్లతో మొదటి, రెండవ బైపాస్‌ రహదారిలో సెంట్రల్‌ మీడియన్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు 80శాతం పూర్తయినట్లు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో రగుడు జంక్షన్‌ వద్ద రూ.3.10కోట్లతో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ వైభవాన్ని చాటేలా సుందరీకరణ చేశామన్నారు. అమృత్‌2.0కింద వేములవాడ, సిరిసిల్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

55అంగన్‌వాడీ టీచర్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌..

జిల్లాలో 586 అంగన్వాడీలను బలోపేతానికి ఖాళీగా ఉన్న 55అంగన్వాడీ టీచర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేశామని తెలిపారు. భర్తీ ప్రక్రియ త్వరలో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీలు

ఎస్సీ కార్పొరేషన్‌లో 90 శాతం సబ్సిడీపై 89 ఈవీ ద్విచక్రవాహనాలు, 70శాతం సబ్సిడీతో 46 త్రిచక్రవాహనాలు, 100శాతం సబ్సిడీపై సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ 10యూనిట్లు, 70 శాతం సబ్సిడీతో పాలిచ్చే పశువులు 49 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరంగా కృషి

శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్‌ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖ ద్వారా నిరంతరం కృషి చేస్తుందని శ్రీనివాస్‌ తెలిపారు. భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళల సంక్షేమం, రక్షణకు మద్దతు అందిస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు.. మొబైల్‌ ఫోన్‌ రికవరీలో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారని, సీఈఐఆర్‌ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ 80.4శాతం మొబైల్‌ రికవరీ రేటు సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 01:33 AM