సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి..
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:19 AM
సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు.
కరీంనగర్ అర్బన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు వివిధ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి డాబాపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా 360 యూనిట్ల వరకు పొందవచ్చునని సూచించారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్ ను గ్రిడ్‌కు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌కో ఏడీవో లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు.