కనుల పండువగా పెద్దాపూర్ మల్లన్న జాతర
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:57 AM
మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్నస్వామి బోనాల జాతర ఆదివారం కనుల పండువగా జరిగింది.
-బోనాలతో ఒకేసారి 70వేల మంది భక్తుల ప్రదక్షిణలు
-తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
-మల్లన్న నామస్మరణతో మార్మోగిన పెద్దాపూర్
మెట్‌పల్లి రూరల్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్నస్వామి బోనాల జాతర ఆదివారం కనుల పండువగా జరిగింది. 70వేల మందికి పైగా భక్తులు ఒకేసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను సమర్పించారు. కాముని పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రతి ఏటా ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతరను ఈసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛతీ్త్‌సగఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా శనివారం అర్ధరాత్రి మల్లన్న స్వామి వారి కల్యాణాన్ని పురోహితులు వైభవంగా జరిపించారు. ఆదివారం వేకువజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలో నిలబడ్డారు. మల్లన్న స్వామి నామస్మరణాలతో పెద్దపూర్ మార్మోగింది. భక్తి శ్రద్ధలతో భక్తులు కొత్త బియ్యంతో కొత్త కుండ, పాత్రలలో బోనమును తయారు చేశారు. భక్తులు బోనంను నెత్తిన పెట్టుకుని సంప్రదాయ నృత్యాలతో డప్పుచప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి సమర్పించారు. భక్తులు బెల్లం, గొర్రెపిల్లను స్వామి వారికి కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న స్వామి రథోత్సవం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చిట్టినేని రఘు, కాంగ్రెస్ నియోజకవర్గఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు సర్పంచ్ చేపూరి సుమలత జీవన్‌రెడ్డి స్వంత డబ్బులతో తాగునీరు ఏర్పాటు చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు నేతృత్వంలో మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్, సురేష్‌బాబుల పర్యవేక్షణలో మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి ఎస్సైలు కిరణ్‌కుమార్, చిరంజీవి, అనిల్‌కుమార్, నవీన్‌లు సిబ్బందితో బందోభస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నీత, దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి విక్రమ్‌గౌడ్, ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ జవిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్లు మెరుగు విలాస్‌గౌడ్, బైరి సురేష్, మెరుగు రమేష్, బుడుత గోపి, గొర్రె సుకన్య, పుల్లూరి చిన్ననర్సయ్య, పూజారి ఆసరి మహేష్‌యాదవ్ పాల్గొన్నారు.