Peddaplly : ఉత్కంఠకు తెర..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:48 AM
ఆంఽధ్రజ్యోతి, పెద్దపల్లి) మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, చైర్మన్ పదవులు, డివిజన్లు, వార్డులు ఏఏ వర్గాలకు రిజర్వు చేస్తారనే విషయమై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
- మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మళ్లీ ఎస్సీ జనరల్‌కే..
- పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్మన్లు బీసీ జనరల్‌కు
- సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వేషన్
- డివిజన్లు, వార్డుల వారీగా జిల్లాలో ప్రకటన
- టికెట్లపై ఆశావహుల గురి, నేతల చుట్టూ ప్రదక్షిణ
(ఆంఽధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, చైర్మన్ పదవులు, డివిజన్లు, వార్డులు ఏఏ వర్గాలకు రిజర్వు చేస్తారనే విషయమై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శనివారం రాజకీయ నాయకుల సమక్షంలో జిల్లా స్థాయిలో డివిజన్లు, వార్డులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రాష్ట్ర స్థాయిలో మేయర్, చైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో కొందరు ఆశావహుల ఆశలు గల్లంతు కాగా, మరికొందరు నాయకులకు మార్గం సులువు అయ్యింది. పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నాయకులు టిక్కెట్ల వేటలో పడ్డారు. రిజర్వేషన్లు ప్రకటించడంతో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తాము పోటీ చేసేందుకు కావాల్సిన టిక్కెట్ దక్కించుకునేందుకు ఆశావహులు నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పటిలాగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ జనరల్, ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ జనరల్‌కు కేటాయించగా, ఈసారి కూడా వరుసగా మూడోసారి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. రామగుండం కార్పొరేషన్‌గా ఏర్పాటు కాకముందు కూడా మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఎస్సీ జనరల్‌కే కేటాయించడం గమనార్హం. రాష్ట్రంలో మరికొన్ని కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు కావడంతో రొటేషన్ పద్ధతిని అనుసరించ లేదు. జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభా ఆధారంగా ఆ వర్గాలకు మేయర్ స్థానాలను కొత్తగా రిజర్వు చేయడం వల్ల ఎస్సీ జనాభాలో రామగుండం మొదటి స్థానంలో ఉండడంతో ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఈ కార్పొరేషన్‌లో ఇతర వర్గాలకు మేయర్ పదవి అందని ద్రాక్షే అయ్యింది. పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్మన్ పదవులు బీసీ జనరల్‌కు, సుల్తానాబాద్ చైర్మన్ జనరల్‌కు కేటాయించారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి జనరల్ మహిళ, సుల్తానాబాద్, మంథని బీసీ మహిళలకు రిజర్వు చేశారు.
ఫ రామగుండంకు వర్తించని రొటేషన్..
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో కంటే 10 డివిజన్లు పెరగడంతో గత రిజర్వేషన్లతో సంబంధం లేకుండా రొటేషన్ లేకుండా కొత్తగా 2011 జనాభా లెక్కల ఆఽధారంగా ఎస్సీ, ఎస్టీ స్థానాలు, బీసీ డెడికేషన్ కమిషన్ సూచించిన మేరకు బీసీ కులగణన ఆధారంగా బీసీల స్థానాలను ఖరారు చేశారు. సగం స్థానాలు జనరల్‌కు కేటాయించారు. మొత్తం 60 డివిజన్లలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 13, బీసీలకు 16, ఇతరులకు 30 సీట్లు కేటాయించారు. వీటిలో 30 స్థానాలను మహిళలకు కేటాయించారు. మహిళలకు కేటాయించిన స్థానాలను డ్రా ద్వారా ఎంపిక చేశారు.
పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 4, బీసీలకు 13, ఇతరులకు 18 స్థానాలు రిజర్వు చేశారు. వీటిలో 18 స్థానాలను మహిళలకు కేటాయించారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 2, బీసీలకు 4, ఇతరులకు 8 స్థానాలు రిజర్వు చేశారు. వీటిలో 7 స్థానాలు మహిళలకు కేటాయించారు.
మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉండగా, ఎస్టీలకు 1, ఎస్సీలకు 2, బీసీలకు 3, ఇతరులకు 7 స్థానాలు రిజర్వు చేయగా, 6 స్థానాలను మహిళలకు కేటాయించడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో డ్రా ద్వారా మహిళకు స్థానాలను కేటాయించారు.
ఫ బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇచ్చేనా?
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి ఎస్సీ, ఎస్టీ, బీసీల 50 శాతానికి మించకుండా స్థానాలు రిజర్వు చేయగా, మిగతా సగం స్థానాలు జన రల్‌కు కేటాయించారు. అందులో భాగంగా జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో బీసీలకు 23 నుంచి 27 శాతం లోపే సీట్లు కేటాయించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగా కాకపోయినా, పార్టీ పరంగా అమలు చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. జనరల్ స్థానాల్లో కొన్ని స్థానాల్లో బీసీలకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా, లేదా అనే చర్చ జరుగుతున్నది. రామగుండం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 25 డివిజన్లను బీసీలకు కేటాయించాల్సి ఉంది. అధికారికంగా 16 డివిజన్లు కేటాయించగా, పార్టీ పరంగా 30 జనరల్ స్థానాల్లో 9 స్థానాలను బీసీలకు ఇవ్వాల్సి ఉం టుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో బీసీకు 15 స్థానాలకు గాను అధి కారికంగా 13 కేటాయించారు. 18 జనరల్ స్థానాల్లో రెండు స్థానాల్లో బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 8 జనరల్ స్థానాల్లో 2 స్థానాలకు బీసీలకు, మంథని మున్సిపాలిటీలోని 7 జనరల్ స్థానాల్లో 2 స్థానాలు బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఏ మేరకు నడుచుకుం టుందోననే చర్చ జరుగుతున్నది. బీఆర్‌ఎస్, భారతీయ జనతా పార్టీలో కూడా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇచ్చే విధంగా ఆ పార్టీ నాయకులపై కింది స్థాయి నాయకులు ఒత్తిడి తీసుక వస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆశావహులంతా నేతల ఇళ్ల వద్ద టిక్కెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా పార్టీలు గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి.