Share News

Peddaplli : అన్నదాతలకు అండగా టాస్క్‌ఫోర్సు

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:05 AM

మంథని, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారంటే చాలు.. అక్రమార్కులు నిద్రలేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను టార్గెట్‌గా చేసుకొని వరి, పత్తి నకిలీ విత్తనాలు, ఎరువులను వారికి అంటగట్టి అందిన కాడికి దోచుకుంటారు.

Peddaplli :  అన్నదాతలకు అండగా టాస్క్‌ఫోర్సు

నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘా

జిల్లా, డివిజన్‌ స్థాయిలో బృందాల ఏర్పాటు

ఎల్‌నినో ఎఫెక్టు.. సాగుపై తొందరవద్దు

మంథని, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారంటే చాలు.. అక్రమార్కులు నిద్రలేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను టార్గెట్‌గా చేసుకొని వరి, పత్తి నకిలీ విత్తనాలు, ఎరువులను వారికి అంటగట్టి అందిన కాడికి దోచుకుంటారు. ప్రతీ వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవగాహన కల్పించిన, వ్యాపారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఏదో ఒక చోట అన్నదాతలు మోసపోతూనే ఉన్నారు. వీటికి అడ్డుకట్ట వేసి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ టీంలను జిల్లా, వ్యవసాయ శాఖ డివిజన్‌ స్థాయిల్లో ఏర్పాటు చేసింది. వీరు తనిఖీలు నిర్వహిస్తున్నా నకిలీ విత్తనాలు, ఎరువులను అక్రమార్కులు దొంగచాటుగా గ్రామాల్లో తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని లేదా నేరుగా విక్రయాలు కొనసాగిస్తుండటంతో పంటల దిగుబడి రాక యేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు నష్టం చేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయదారుల ఆట కట్టించేందుకు ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా, డివిజన్‌ స్థాయిల్లోని టాస్క్‌ఫోర్స్‌ టీంలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిఘాను తీవ్రతరం చేస్తోంది.

జిల్లా, డివిజన్‌ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు..

నకిలీ విత్తనాలను, ఎరువులను నియంత్రించేందుకు ప్రభుత్వం కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలో వ్యవసాయ డివిజన్‌ స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో వ్యవసాయాధికారి, డీఎస్పీ, అదనపు కలెక్టర్‌, పరిశ్రమల శాఖ జీఎం, సివిల్‌ సప్లై అధికారి, ఏఎల్‌వోలు ఉంటారు. జిల్లాని వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలోని డివిజన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ఆర్డీవో, ఏడీఏ, డీసీవో అధికారి, ఎరువుల షాప్‌ యజమానుల సంఘం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనాల నియంత్రణ కమిటీలో మండల ఏవో, పోలీసు సీఐ, ముగ్గురు పీసీలు ఉంటారు.

టాస్క్‌ఫోర్స్‌ విధులు ఇవే..

జిల్లా, డివిజన్‌ స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌ టీంలు అనధికార, నకిలీ విత్తనాల, ఎరువుల విక్రయాలకు సంబంధించి వాటి నియంత్రణకు నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎరువులు, విత్తనాలకు సంబంధించి పంపిణీదారులు, డీలర్ల వద్ద షాపుల్లో, గోదాంలో ఉన్న నిల్వలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, రవాణా ఏజెన్సీల్లో తనిఖీలు చేస్తారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా తనిఖీలు నిర్వహిస్తారు. అక్రమంగా నిల్వ చేయడం, సరిహద్దులు దాటిపోకుండా చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం, అక్రమాలకు పాల్పడిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గత ఏడాదిలో సైతం ఎరువులు, విత్తనాలు జిల్లా సరిహద్దులు దాటకుండా చెక్‌పోస్టులను సైతం ఏర్పాటు చేశారు.

సాగుపై అప్పుడే తొందర వద్ద..

రుతుపవనాల రాకతో కురిసే తొలకరి జల్లులతోనే గ్రామాల్లోని రైతులు వ్యవసాయ సాగుపై దృష్టి సారించి విత్తనాలు నాటుకోవడం సహజంగానే కొనసాగే ప్రక్రియ. కానీ ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎల్‌నినో ఎఫెక్టులో సాధారణ వర్షపాతం కంటే తక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ కారణంగా రైతులు అప్రమత్తమై సాగుపై తొందర పడకుండా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు లేక భూమిలో విత్తిన పత్తి, వరి విత్తనాలు, పెట్టుబడులు, శ్రమను రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే ఆరుతడి పంటల సాగు చేయడం మేలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దాదాపు 20 రోజులపాటు వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీని కారణంగా ఒక్కోసారి అతి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగస్టు 15 వరకు ఇలాంటి పరిస్థితి యథావిధఙగా ఉంటే వరి సాగు చేసుకునే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు వారు సైతం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

సాగుపై మూడు విభాగాలు విభజన..

ఎల్‌నినో సాధారణం కంటే తక్కవ వర్షాలు కురిస్తే మూడు విభాగాలుగా, ఆకస్మికంగా ప్రణాళికలు మారుస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 15 వరకు సాధారణం కంటే తక్కవ వర్షపాతం కురిస్తే పప్పు దినుసులు, మిల్లెట్స్‌, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగు చేయాలని, నెలాఖరు వరకు తక్కవ వర్షపాతం నమోదైతే కంది, పొద్దు తిరుగుడు, కూరగాయల సాగు, ఆగస్టు 30 వరకు సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిస్తే కంది, ఆముదం, మొక్కజొన్న, కొర్రలు, జొన్నలు, కూరగాయల సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

పంటల సాగు అంచనా ఎకరాల్లో...

వరి: 2,15,500

పత్తి: 52,094

మొక్కజొన్న: 886

మిర్చి: 133

కందులు: 208

పసుపు: 295

నువ్వులు: 44

పెసరు: 10

మినుములు: 11

అయిల్‌పామ్‌: 3179

వాణిజ్య పంటలు: 5125

Updated Date - Jun 08 , 2026 | 01:05 AM