Share News

Peddaplli : సంగీత కళాశాలకు నూతన శోభ

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:48 AM

మంథని, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల కొత్త కళను సంతరించుకుంది. స్థానిక పెంజేరు కట్టలో ఉన్న మహిళా మండలి భవనాన్ని సంగీత కళాశాలకు శాశ్వత భవనంగా

Peddaplli :  సంగీత కళాశాలకు నూతన శోభ

- 34 ఏళ్ళ తర్వాత సొంత భవనం కేటాయింపు

- 1992 కళాశాలను మంజూరు చేయించిన నాటి స్పీకర్‌ శ్రీపాదరావు

- మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రారంభించడానికి ఏర్పాట్లు

- కళాశాలల్లో వివిధ కోర్సుల్లో కొనసాగుతున్న అడ్మిషన్లు

మంథని, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల కొత్త కళను సంతరించుకుంది. స్థానిక పెంజేరు కట్టలో ఉన్న మహిళా మండలి భవనాన్ని సంగీత కళాశాలకు శాశ్వత భవనంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సరైన స్థలం కేటాయింపులో, నిధుల మంజూరులో జాప్యం, ఇతర కారణాల మూలంగా ఇన్నాళ్ళు సంగీత కళాశాల సొంత భవనానికి నోచుకోలేదు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో ఎట్టకేలకు దాదాపు 34 ఏళ్ళ తర్వాత సంగీత కళాశాలకు ప్రభుత్వం సొంత భవనాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా దృష్టి సారించి భవనంలో కళాశాల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు సంబంధిత శాఖల ద్వారా చేయించడానికి చర్యలు తీసుకున్నారు. పలుమార్లు సందర్శించి పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం భవనానికి రంగులు వేసి మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బోర్డు రాయించారు. భవనం లోపల మరమ్మతు పనులు నడుస్తున్నాయి. శ్రావణ మాసంలో మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా సంగీత కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించడానికి వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు చొరవతో సంగీత కళాశాల..

ప్రాచీన కాలం నుంచి వేద విద్యకు నిలయమైన మంథనిలో మాజీ శాసనసభ స్పీకర్‌ దుద్దిళ్ళ శ్రీపాదరావు ప్రత్యేక చొరవ తీసుకొని 1992లో ప్రభుత్వ సంగీత కళాశాలను మంజూరు చేయించారు. స్థానిక గాంధీచౌక్‌ సమీపంలోని అద్దె భవనంలో ఆయన ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మంథనిలో సంగీత కళాశాల అలరిస్తుంది. కళాశాలలో జరిగే సంగీత సాధనలో స్వరాలు, రాగాలు, వాయిద్య శబ్దాలతో కళాశాల చుట్టూ ఉన్న ప్రజలకు వీనుల విందుచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆరు ప్రభుత్వ సంగీత కళాశాలుండగా వాటిలో హైదరాబాద్‌లో మూడు, వరంగల్‌, నిజామాబాద్‌, మంథనిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

సర్టిఫికెట్‌, డిప్లమా కోర్సులు..

హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడి (పొట్టి శ్రీరాములు) తెలుగు యూన్సివర్సిటీకి అనుబంధంగా మంథనిలోని ప్రభుత్వ సంగీత కళాశాల కొనసాగు తుంది. మంథని కళాశాలలో టీచింగ్‌ కొనసాగుతుం డగా, పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ యూన్సివర్సిటీ ఆధీనం కొనసాగుతున్నాయి. సంగీత కళాశాలలో ప్రస్తు తం కర్ణాటక గాత్రం, మృదంగం, పేరణీ, వీణా, కూచి పూడి, వయోలిన్‌ విభాగాల్లో విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. తమకు ఆసక్తి ఉన్న వివిధ విభా గాల్లో కళాశాలలో చేరే విద్యార్థులకు 4 సంవత్సరాల సర్టిఫికెట్‌ కోర్సు, 2 సంవత్సరాల డిప్లామా కోర్సుల్లో బోధన కొనసాగుతోంది.

వివిధ కోర్సుల్లో కొనసాగుతున్న అడ్మిషన్లు

మంథని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరటానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ జే.శారద వెల్లడించారు. కర్ణాటక గాత్రం, కూచిపూడి నృత్యం, పేరణి నాట్యం, మృదంగం, వీణా, వయోలిన్‌ కోర్సుల విభాగాల్లో 4 సంవత్సరాల సర్టిఫికెట్‌ కోర్సు, 2 సంవత్సరాల డిప్లామా కోర్సులో చేరటానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 20వ తేదీలోపు తమ కార్యాలయంలో రూ.25 చెల్లించి దరఖాస్తు పొందాలని సూచించారు. ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Aug 03 , 2026 | 12:48 AM