Peddaplli : ఇందిరమ్మ బీమా అమలెప్పుడు...?
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:22 AM
పెద్దపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ బీమా పథకానికి అడుగు ముందుకు పడడంలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
- జూన్ 2 నుంచి అమలు చేస్తామని ప్రకటన
- నెల రోజులు గడిచినా మార్గదర్శకాలు రూపొందించని ప్రభుత్వం
- అటకెక్కిన గతేడాది ప్రకటించిన రాజీవ్ యువవికాసం పథకం
- ఇందిరమ్మ బీమా పథకంపై కూడా అనుమానాలు
పెద్దపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ బీమా పథకానికి అడుగు ముందుకు పడడంలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అమలులో ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు బీమా రక్షణ కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాదాపు రెండు నెలలు కావస్తున్నా అమలు చేసేందుకు మార్గదర్శకా లను విడుదల చేయలేదు. అర్హతలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పథకం అమలుపై ప్రజల్లో సందే హాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో గతంలో ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతేడాది జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 6 వేల కోట్ల వ్యయంతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యవకులకు స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,23,643 మంది వందలాది రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2వ తేదీ నుంచి అమలు చేయకపోగా, తరచూ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈ పథకం ప్రారంభంపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది. దీంతో ఈ పథకం అటకెక్కినట్లేననే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ బీమా పథకం కూడా అదే బాట పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకవచ్చిన రైతుబీమా పథకం అమల్లో ఉంది. ఎవరైతే పట్టా భూములు కలిగి ఉన్నారో వారికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. బీమా ప్రీమియం ప్రభు త్వమే చెల్లిస్తున్నది. పట్టా భూములు కలిగిన రైతులు అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుం బాలకు బాసటగా నిలిచేందుకు ఈ పథకం దోహద పడుతున్నది. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. గత ఏడాదికి సంబంధించి కొందరు రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచా రం. ఫిబ్రవరి నుంచి జూన్ మొదటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందలేదని తెలుస్తున్నది. రైతుబీమా పథకం మాదిరిగానే ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే రాష్ట్ర అవతరణ దినోత్స వమైన జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు దాని గురించి ఏమి మాట్లాడడం లేదు. ఈ పథకానికి సంబంధించి అర్హతలు, కుటుంబ యజమాని ఎంపిక విధానం, సహజ మరణానికి వర్తింపజేస్తారా? క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ బీమా సంస్థ ద్వారా అమలు చేస్తారు? వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో పథకం ప్రకటనలకే పరిమితమవుతుందా? లేక త్వరలోనే అమల్లోకి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.