Peddaplli : ప్రారంభానికి సిద్ధమైన క్యాథ్‌ల్యాబ్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:49 AM
గోదావరిఖని, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఫ గోదావరిఖనిలో తొలి క్యాథ్‌ల్యాబ్
ఫ కోల్‌బెల్ట్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు
ఫ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఏడాదిలోనే ఏర్పాటు
ఫ కార్మిక కుటుంబాల సంక్షేమం దిశగా సింగరేణి మరో ముందడుగు
గోదావరిఖని, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు గుండెకాయగా ఉన్న కార్మికుల హృదయాలకు గట్టి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను రామగుండం-1 ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నది.
సింగరేణి కార్మికులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిం చాలనే లక్ష్యంతో కార్మికులు ఎక్కువగా నివసించే గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి సంస్థ తొలి క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగులతోపాటు సమీప గ్రామాల ప్రజలకు గుండె సంబంధిత చికిత్స అందనుంది.
వయోభేదం లేకుండా గుండె సమస్యలు
ప్రస్తుతం గుండె జబ్బులు వయోభేదం లేకుండా పెరిగిపోయాయి. ఇది ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం కష్టమే కానీ, ఈ సమస్య తలెత్తిన తొలి గంట అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటారు. దానిని గోల్డెన్ అవర్‌గా పేర్కొంటారు. ఈ సమయంలో సత్వరమే చికిత్స అందించగలిగితే ప్రాణాలను కాపాడవచ్చు. అయితే సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కంపెనీ ఆధ్వర్యంలో ఆధునిక వైద్య సౌకర్యాలు గల ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ అందులో కార్డియాక్ సంబంధిత సేవలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. గుండెపోటు వచ్చిన రోగులను హైదరాబాద్, కరీంనగర్, వరం గల్ తరలిస్తున్నారు. అంతదూరం వెళ్ళేసరికి కొందరు మృతి చెందు తున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తోంది.
ప్రాణాలను కాపాడే ’గోల్డెన్ అవర్’
గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకం. అదే సమయంలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందితే రోగి ప్రాణాలను కాపాడే అవకాశాలుంటాయి. ఈ అత్యవసర సేవల ప్రాధాన్య తను గుర్తించిన సింగరేణి యాజమాన్యం, అత్యాధునిక సాంకేతికతతో క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. కోల్‌బెల్ట్ ప్రజలకు సకాలంలో, తక్కువ వ్యవధిలోనే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కార్మికుడి ఆరోగ్యమే సంస్థ సంపద
కార్మికుల ఆరోగ్యం కోసం సింగరేణి యేటా రూ.300కోట్లకు పైగా వెచ్చి స్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల రెఫరల్స్ కోసమే అధిక మొత్తం నిధులను కేటాయిస్తోంది. గతేడాది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న సుమారు 3వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేశారు. అయితే గుండె జబ్బుల విషయంలో ప్రతీ నిమిషం విలువైనదే కావడంతో లక్షల రూపాయలు వెచ్చించడం కంటే సకాలంలో అత్యాధునిక చికిత్స అందించడం ద్వారానే ప్రాణాలను కాపాడవచ్చనే సంకల్పంతో యాజమాన్యం గోదావరిఖనిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కోల్‌బెల్ట్ ప్రజలకు ఉపయోగం
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో మొత్తం 7890 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగరేణి కార్డియాలజీ విభాగం ఉం టుంది. ఇందులో 5 బెడ్ల సామర్థ్యం గల ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూని ట్, 10 బెడ్ల సామర్థ్యంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ప్రత్యేక గదులతో ఔట్ పేషెంట్ బ్లాక్ ఉంటాయి.
గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, భూపాల పల్లి, మంథని తదితర పరిసర ప్రాంతాలతో పాటు కోల్‌బెల్ట్ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు క్యాథ్‌ల్యాబ్ ఉపయోగపడనుంది. పబ్లిక్, ప్రైవేట్ భాగ స్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ కోసం ఏడేళ్లలో సింగరేణి సంస్థ దాదాపు రూ.50కోట్ల ఖర్చును భరించనున్నది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్‌స్కీం టారిఫ్‌ల మేరకు తక్కువ ఖర్చుతో స్థానికులకు కూడా వైద్య సేవలను అందించే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతీ నెల దాదాపు 3 వేల మందికి పైగా ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా. క్యాథ్‌ల్యాబ్‌లో ఉన్న బెడ్ల సామర్థ్యంలో 50 శాతం సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణీయులకు రిజర్వు చేశారు.
క్యాథ్‌ల్యాబ్‌లో సేవలు
క్యాథ్‌ల్యాబ్‌లో అత్యాధునిక పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉంటాయి. అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, వైద్య సిబ్బందితో నిరంతర సేవలందుతాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, స్టెంట్ అమరిక చేపడుతారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం క్యాథ్ ల్యాబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇక సుదూర ప్రాంతాలకు తరలించకుండా, ఇకపై గోల్డెన్ అవర్‌లోనే అత్యవసర చికిత్స అందించడం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడే కేంద్రంగా గోదావరిఖని క్యాథ్ ల్యాబ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.