Peddapally : వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్..
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:15 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది.
- ఓట్ల వేటలో చతికిలబడిన బీఆర్‌ఎస్
- మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ
- రెబల్స్, స్వతంత్రుల నుంచే గట్టి పోటీ
- కాంగ్రెస్‌కు 44.12 శాతం, బీఆర్‌ఎస్‌కు 22.48 శాతం, బీజేపీకి 9.59 శాతం ఓట్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గల ఒక కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 124 డివి జన్లు, వార్డుల్లో కాంగ్రెస్ 89 స్థానాలు, బీఆర్‌ఎస్ 16 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 12 స్థానాలు, సీపీఐ ఒక స్థానం, స్వతంత్రులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రులు మినహా గట్టి పోటీనిస్తాయని అనుకున్న ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు అధికార కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడ లేకపోయాయి.
2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, రామగుం డం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, ఆ తర్వాత 2024 జూన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. నెల రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 262 పంచాయతీలకుగాను 189 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు గెలుపొందారు. అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్య కర్తలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. 124 డివిజన్లు, వార్డులకు గాను 89 స్థానాల్లో నేరుగా గెలుపొందారు. ఎవరి మద్దతు లేకుండానే సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోనున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్‌లో 50 డివి జన్లకు గాను బీఆర్‌ఎస్ పార్టీ 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 9 స్థానాలు, బీజేపీ 6 స్థానాలకు గెలుచుకున్నది. సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకు నేందుకు మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ల మద్దతు, ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో సభ్యులతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపొం దిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం 13 స్థానాల్లో పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ గతంలో ఆరింటిలో గెలుపొందగా, ఈసారి ఒక డివిజన్‌కు ఆ పార్టీని ఓటర్లు పరిమితం చేశారు.
పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, గతంలో బీఆర్‌ఎస్ 25 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, ఎంఐఎం 2 స్థానాలు, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు, బీఆర్‌ఎస్, బీజేపీలో ఒక్కో స్థానం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 5 స్థానాలు, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చి నప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోక పోవడంతో ఒక స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్ 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించి నప్పటికీ సాధ్యం కాలేదు. అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా అక్కడ నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కాం గ్రెస్ పార్టీ 11 స్థానాలు, బీఆర్‌ఎస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఒక్కో స్థానంలో గెలిచాయి.
మంథని మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలు పొందగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 2 స్థానాల్లో గెలిచారు. అప్పుడు, ఇప్పుడు అక్కడ బీజేపీ ఖాతా తెరవలేక పోయింది.
రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో గత ఎన్నికల్లో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్‌గా తీసుకుని 30 స్థానాల్లో గెలుపొందినప్పటికీ, ఇప్పుడు బీఆర్‌ఎస్ 16 స్థానాల్లోనే గెలుపొందింది. బీజేపీ అప్పుడు ఎనిమిదింటిలో గెలుపొం దగా, ఇప్పుడు మూడు స్థానాల్లోనే విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకు పోతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ముందంజలో ఉండడంతో వచ్చే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీలు ఏ మేరకు పోటీనిస్తాయోననే చర్ఛ జిల్లాలో జరుగుతున్నది. వరుస పరాజయాలతో పార్టీ క్యాడర్‌లో నిస్తేజం నెలకొంటున్నది. వారిలోని నైరాశ్యాన్ని పోగొట్టి, క్యాడర్‌ను ఇప్పటి నుంచే పెంచుకుంటే తప్ప వచ్చే ఎన్నికల వరకు పుంజుకునే పరిస్థితులు ఉంటాయని, లేకుంటే వెనుకబడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఓట్ల శాతం ఇలా..
ఓట్ల శాతాన్ని పరిశీలించినట్లయితే ఈ ఎన్నికల్లో 124 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం కాగా, 123 డివిజన్లు, వార్డులకు జరిగిన పోలింగ్ సందర్భంగా మొత్తం 1,81,493 ఓట్లు పోలు కాగా, కాంగ్రెస్ పార్టీ 80,078 ఓట్లు 44.12 శాతం సాధించింది. బీఆర్‌ఎస్ పార్టీకి 40,816 ఓట్లు 22.48 శాతం సాధించింది. బీజేపీ 17,407 ఓట్లు 9.59 శాతం సాధించింది.