Peddapally : పంటల బీమా పథకం అమలయ్యేనా!
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:03 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకూ బడ్జెట్లో నిధులు కేటాయించింది.
- 2019-20లో నిలిచిన పథకం
- రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం
- బడ్జెట్‌లో రూ.1,886 కోట్లు కేటాయింపు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకూ బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే నిధులు కేటాయించిన ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుందా, లేదా అనే సంశయం రైతుల్లో నెలకొన్నది. ఈ ఏడాది నుంచైనా పంటల బీమా పథకానికి మోక్షం లభించాలని రైతులు ఆశిస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల 80 వేల ఎకరాల పైచిలుకు సాగు భూములు ఉన్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు యేటా సాగు చేస్తున్నారు. జిల్లాలోని సుమారు లక్ష 80 వేల ఎకరాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుండగా, 20 వేల ఎకరాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతున్నాయి. అంతేకాకుండా చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా 50 వేల ఎకరాకు పైగా సాగవుతున్నాయి. వర్షాధారంగా 20 నుంచి 30 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో రెండు లక్షల 78 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా, యాసంగిలో రెండు లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో అత్య ధికంగా వరితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. యేటా భారీ వర్షాలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక పంటలను రైతులు నష్టపోతున్నారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఎప్పుడో ఒకసారి నష్టపరిహారాన్ని అందిస్తుండగా, నామమత్రంగానే పంట నష్టపరిహారం సర్వే జరుగుతున్నది.
ఫ 2019-20 వరకే అమలైన పంటల బీమా పథకం
రాష్ట్రంలో పంటల బీమా పథకం 2019-20 సంవత్సరం వరకు మాత్రమే అమలయ్యింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంగా అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ప్రీమియం చెల్లిస్తే, రైతులు తమ వాటా కింద 10 శాతం ప్రీమియం చెల్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ప్రత్యేక రైతులు వ్యవసాయ పంటల సాగు కోసం జూన్, జూలై మాసాల్లో పంట రుణాలు తీసుకుంటారు. అదే సమయంలో రైతులు పండించే పంటలకు గాను బీమా చేస్తుంటారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాల నుంచి రైతుల వాటాను మినహాయించుకుని వారు పండించే పంటలను బీమా పథకంలో చేరుస్తారు. ఈ పథకంలో కొన్ని పంటలు గ్రామ యూనిట్‌గా, కొన్ని పంటలు మండల యూనిట్‌గా అమలు చేశారు. ఈ పథకంలో లోసుగులు ఉన్నాయని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దీనిని సవరించాలని సూచనలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం సవరణను సరిచేయక పోవడంతో పంటల బీమా పథకం నుంచి ప్రభుత్వం తప్పుకున్నది. 2020-21 నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేదు. రైతులు పంట నష్టపోతే మాత్రం ప్రభుత్వం కేవలం ఎకరానికి 6 వేల చొప్పున, ఆ తర్వాత 10 వేల రూపాయల చొప్పున అందజేస్తూ వచ్చింది. ఈ పరిహారం కూడా పూర్తిస్థాయిలో రైతులకు చెల్లించకుండా నామమాత్రంగానే చెల్లించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా కూడా ఆ పథకాన్ని ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్నది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన బడ్జెట్లో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు రూ.1,886 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కాగితాలకే పరిమితం అవుతుందా, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందా అనే సంశయం రైతులు నెలకొని ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం అయితే గానీ ఈ పథకం అమలు చేస్తారా లేదా అనే విషయం తేలనున్నది.