Peddapally : జలం.. పాతాళం...
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:49 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదు
- గతేడాదితో పోలిస్తే 1.69 మీటర్లు పడిపోయిన భూగర్భ జలమట్టం
- వ్యవసాయ బావుల్లో పూడిక తీస్తున్న రైతులు
- సాగు, తాగు నీటిపై ఆందోళన
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఈ ఏడాది జూలై చివరి నాటికి సాధారణ వర్షపాతం కంటే 30 శాతం తక్కువ వర్షాలు నమోదవడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమ యంతో పోలిస్తే 1.69 మీటర్ల మేర జలమట్టం తగ్గినట్లు జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు క్రేన్లు, ఎక్స్‌కవేటర్లతో పూడిక తీస్తున్నారు. జిల్లాలో 2026-27లో జూలై నెలాఖరు వరకు 305 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం 212 మిల్లీమీటర్లే నమోదయ్యాయి. దీంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి.
6.97 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు
ప్రస్తుతం జిల్లా సగటు భూగర్భ జలమట్టం భూమి ఉపరితలం నుంచి 6.97 మీటర్ల లోతులో ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో అది 5.28 మీటర్లు మాత్రమే ఉంది. జిల్లాలోని రామగిరి మండలంలో 3.32 మీటర్లు, అంతర్గాం మండలంలో 3.51 మీటర్లు, ఓదెల మండలంలో 3.62 మీటర్లు, జూలపల్లి మండలంలో 3.92 మీటర్లు, రామగుండం మండలంలో 4,42 మీటర్ల నీళ్లు ఉన్నాయి. ముత్తారం మండలంలో 5.11 మీటర్లు, కమాన్ పూర్ మండలంలో 5.41 మీటర్లు, పాలకుర్తి మండలంలో 5.81 మీటర్లు, సుల్తానాబాద్ మండలంలో 6.22 మీటర్ల నీళ్లు ఉన్నాయి. ధర్మారం మండలంలో 6.70 మీటర్లు, పెద్దపల్లి మండలంలో 6.99 మీటర్లు, ఎలిగేడు మండలంలో 8.40 మీటర్లు, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 9.35 మీటర్లు, మంథని మండలంలో 15.13 మీటర్ల నీళ్లు ఉన్నాయి. 10 మండలాల్లో 10 నుంచి 20 మీటర్ల మధ్య భూగర్భ జలమట్టం నమోదైంది. అయితే 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటిమట్టం ఏ మండలంలోనూ నమోదు కాలేదు. భూగర్భ జలశాఖ వివరాల ప్రకారం జిల్లాలో సుమారు 46,683 వ్యవసాయ పంపుసెట్లు పనిచేస్తున్నాయి. 2024-25 అంచనాల ప్రకారం జిల్లాలో 47,233 హెక్టారు మీటర్ల నికర భూగర్భ జల వనరులు అందు బాటులో ఉండగా, 22,190 హెక్టారు మీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇంకా 25,053 హెక్టారు మీటర్ల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జిల్లా 47 శాతం వినియోగ స్థాయితో సేఫ్ కేటగిరీలోనే ఉన్నప్పటికీ, వర్షాభావం కొనసాగితే భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలను పరిరక్షించేందుకు పీజియోమీటర్ల ద్వారా నీటిమట్టాల పరిశీలన, వాల్టా చట్టం అమలు, కృత్రిమ భూగర్భ జలాల రీచార్జ్ నిర్మాణాలకు అనువైన ప్రదేశాల ఎంపిక, రైతులకు బావుల ఎంపిక, ఇసుక రీచ్‌ల గుర్తింపు వంటి కార్యక్రమాలను భూగర్భ జల శాఖ చేపడుతోంది.
- బావుల్లో పూడికతీతపై ఆశలు
ఆరు సంవత్సరాలుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు లేకపోగా ప్రాజెక్టులు నిండడంతో రెండు పంటలకు సరిపడా నీళ్లు వచ్చాయి. ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఆశించిన మేరకు వర్షాలు పడతాయని భావించిన రైతులు వ్యవసాయ బావుల కింద వరి నాట్లు వేశారు. ఇప్పటికే జిల్లాలో 40 వేలకు పైగా ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. అయితే 20 రోజులుగా జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు పంటలు ఎండిపోతాయనే భయంతో బావుల్లో పూడికతీత పనులను మొదలు పెట్టారు.
- వర్షాలు లేకపోతే మరింత సంక్షోభమే..!
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పోవడం రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే భూగర్భ జలమట్టం తగ్గుతుండగా, ఇదే పరిస్థితి కొనసాగితే బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు, కృత్రిమ రీచార్జ్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.