Peddapally : మున్సిపాలిటీలపై ఎన్నికల భారం
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:36 AM
కోల్‌సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ లకు ఇప్పుడు ఎన్నికలపై భారం పడింది. ఎన్నికల నిర్వ హణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు.
- బడ్జెట్ విడుదల చేయని ప్రభుత్వం
- సాధారణ నిధులతోనే సర్దుబాటు చేసుకోవాలని సూచన
- రూ.4కోట్లపైనే ఎన్నికల వ్యయం
- పన్నుల వసూళ్లకు ఉరుకులు పరుగులు
కోల్‌సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ లకు ఇప్పుడు ఎన్నికలపై భారం పడింది. ఎన్నికల నిర్వ హణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచే సర్దు బాటు చేసుకోవాలంటూ సూచించింది. ఆస్తి పన్ను వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చే డబ్బులతోనే ఎన్నికల వ్యయం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలి టీలు ఉన్నాయి. రామగుండం నగరపాలక సంస్థలో 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇం దుకు గాను సుమారు రూ.2.5 కోట్లపైనే వ్యయం అవు తుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోనే సుమా రు రూ.1.7కోట్ల వరకు వ్యయం చేసినట్టు తెలుస్తుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36వార్డులకు ఎన్నికలు నిర్వ హించాల్సి ఉంటుంది. సుల్తానాబాద్‌లో 15, మంథనిలో 13వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. పెద్దపల్లి మున్సి పాలిటీలో సుమారు రూ.75లక్షల మేర వ్యయం అవు తుందని అంచనా వేస్తున్నారు. సుల్తానాబాద్, మంథని ల్లో రూ.25లక్షల నుంచి రూ.50లక్షల చొప్పున వ్యయం అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మున్సిపల్ ఎన్ని కలకు సంబంధించి జిల్లాలో మున్సిపాలిటీలపై రూ.4కోట్ల భారం పడే అవకాశం ఉంది.
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభు త్వం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ స్టేషన్ మేనేజర్లు, సెక్షన్ అధికా రులు, జోనల్ ఆఫీసర్లు, వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులు, కౌంటింగ్ స్టాఫ్, పోలింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో 2 నుంచి 3వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. రామగుండం లోనైతే రెండు వార్డులకే ఒక రిటర్నింగ్ అధికారి, సహా య రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు 20శాతం అదనపు సిబ్బందిని నియమించు కోవాల్సి ఉంటుంది. వీరికి గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, మంచినీటి సౌకర్యం, టెంట్లు, ఇతర సౌకర్యాలను సమకూర్చాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్‌ల డిస్ర్టిబ్యూషన్ మొదలు స్ర్టాంగ్ రూమ్‌లకు చేరే వరకు సుమారు 48గంటలు సిబ్బందికి భోజనం, ఇతర సౌకర్యాలు కూడా ఆయా మున్సిపాలిటీలే చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎన్నికల సిబ్బందికి వాహనాలు సమకూర్చడం, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ వంటి, కౌటింగ్ స్టేషన్‌లలో ఏర్పాట్లు, కౌటింగ్ ప్రక్రియ వరకు అన్నీ ఖర్చులు మున్సి పాలిటీలే భరించాల్సి ఉంటుంది. ఈ సారి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ పెట్టాలని ఆదేశాలిచ్చారు. రామగుండంలో గత ఎన్నికల్లో 1500లకుపైగా సిబ్బంది సేవలను వినియో గించుకున్నారు. ఈ సారి 1700మందికిపైగా సిబ్బంది అవసరం కానున్నారు.
రామగుండంలో రూ.2.5కోట్లపైనే వ్యయం...
రామగుండం నగరపాలక సంస్థలో ఎన్నికలకు సంబంధించి రూ.2.5కోట్లపైనే వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కార్పొరేషన్ ఖజానా ఖాళీగా ఉంది. 1వ తేదిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, ఇతర ఖర్చులకు రూ.1.25కోట్లు అవసరం, అదనంగా ఎన్నికల ఖర్చు రూ.2.5కోట్ల మేర ఉంటుంది. పన్నులు మాత్రం ఇప్పటికే 63శాతం వసూలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల వ్యయం కార్పొరేషన్‌కు భారంగా మారనున్నది. కార్పొరేషన్‌కు గతంలో ఎన్‌టీపీసీ చెల్లించిన అనుమ తుల ఫీజుల నుంచి కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పెట్టారు. ఆ సొమ్మును ఎన్నికల వ్యయానికి వెచ్చించినా అదనంగా మరో రూ.1కోటి అవసరం కానున్నాయి. ఎన్నికల దృష్ట్యా సాధారణ నిధుల నుంచి ఇతర చెల్లింపులన్నీ నిలిపివేశారు.
పన్నుల వసూళ్ల వేటలో సిబ్బంది...
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం, సాధారణ నిధుల నుంచే ఖర్చు పెట్టుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో మున్సిపల్ కమి షనర్లు సిబ్బందిని పన్నుల వసూళ్లకు పురమాయిం చారు. ఆదరబాదరగా సిబ్బంది పన్నుల వేటలో పడ్డారు.