Share News

Peddapally : ఏడు సబ్జెక్టులు.. నెల రోజులు

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:06 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుక రావడంతో విద్యా ర్థులు ఆందోళనకు గురవుతున్నారు.

Peddapally :   ఏడు సబ్జెక్టులు.. నెల రోజులు

- మారిన పదో తరగతి పరీక్షల విధానం

- ఒక్కో పరీక్షకు నాలుగు రోజుల వ్యవధి

- మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు

- పరీక్షలు లేని రోజుల్లో బడికి వెళ్లాల్సిందే..

- కొత్త టైం టేబుల్‌పై ఆందోళనలో విద్యార్థులు

- మానసికంగా సిద్ధం చేస్తున్న ఉపాఽధ్యాయులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుక రావడంతో విద్యా ర్థులు ఆందోళనకు గురవుతున్నారు. సీబీఎస్సీ తరహాలో నెల రోజులపాటు వార్షిక పరీక్షలు నిర్వహించే విధంగా టైం టేబుల్‌ను రూపొందించారు. ఏడు సబ్జెక్టుల పరీక్షలు నెల రోజులపాటు నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు నాలుగు రోజులపాటు వ్యవధి ఇచ్చారు. పరీక్షలు లేని రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా చొరవ చూపాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక పరీక్ష పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్ష సబ్జెక్టు గురించి సంబంధిత ఉపాఽధ్యాయులు బోధించాలని నిర్ధేశిం చారు. ఆయా సబ్జెక్టుల్లో బలహీనంగా ఉండే వారిని గుర్తిం చి ఆ దిశగా సంసిద్ధం చేయాలన్నారు. ఈ ఏడాది నుంచే కొత్త విధానంలో పరీక్షలు నిర్వహించనుండడంతో విద్యా ర్థులు అందుకు మానసికంగా సిద్ధ పడడం లేదు. పరీక్షల టైం టేబుల్‌ సీబీఎస్‌ఈ పరీక్షల మాదిరిగా ఉంటుందనే విషయమై నాలుగైదు మాసాల ముందు నుంచే విద్యా ర్థులకు అవగాహన కల్పించి ఉంటే విద్యార్థులు అందుకు సిద్ధంగా ఉండే వారు. పరీక్ష పరీక్షకు మధ్య వ్యవధిలో తప్పనిసరిగా పాఠశాలకు రావాలని ఉపాధ్యాయులు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు పాఠశాలలకు రప్పించడం గగనంగా మారనున్నది.

ఫ గతంలో వెంట వెంటనే పరీక్షలు..

పదో తరగతి పరీక్షలు యేటా మార్చి నెలాఖరులోపే పూర్తి చేస్తున్నారు. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా, ఒక్క హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించే వారు. అప్పుడు ఆదివారం, పండుగ సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో వరుసగా పరీక్షలు ఉండేవి. పదిహేను రోజుల్లో పూర్తయ్యేవి. కరోనా అనంతరం పదో తరగతి పరీక్షలను సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున నిర్వహించారు. ఇవి పది రోజుల్లో పూర్తయ్యేవి. ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ తరహాలో సబ్జెకుకు సబ్జెక్టుకు మధ్య వ్యవధి ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా విద్యార్థులు ఫ్రీ ఫైనల్‌లో పరీక్షలు పూర్తయిన వెంటనే వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించుకుని వార్షిక పరీక్షలకు సంసిద్ధం అవుతారు. వారంతా నేరుగా ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీ క్షలు రాస్తుంటారు. వసతి గృహాలు, గురుకులాల్లో చదువు కునే విద్యార్థులు అందులోనే ఉండి పరీక్షలు రాసే వారు. ఇప్పుడు నెల రోజులపాటు పరీక్షలు నిర్వహించే విధంగా టైంటేబుల్‌ రూపొందించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండ డంతో విద్యార్థులు భారంగా భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక్కో సబ్జెక్టు రెండు పేపర్లు వేరు చేసి పరీక్షలు నిర్వహిస్తే బాగుండేదని, ఏడు సబ్జెక్టులకు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల మానసికంగా సిద్ధం కాలేక పోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఫ జిల్లాలో పది పరీక్షలకు 7,495 మంది..

పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో 7,495 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇదులో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌, గురుకుల విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువు కునే విద్యార్థులు 4,536 మంది ఉండగా, ప్రైవేట్‌ పాఠశా లల్లో 2,959 విద్యార్థులు ఉన్నారు. వీరంతా పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. మార్చి 14వ తేదీన తెలుగు పరీక్ష, 18వ తేదీన హిందీ, 23వ తేదీన ఇంగ్లీష్‌, 28వ తేదీన గణితం, ఏప్రిల్‌ 2వ తేదీన భౌతిక శాస్త్రం, 7వ తేదీన జీవశాస్త్రం, 13వ తేదీన సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు 3:15 గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష పరీక్షకు నాలుగు రోజుల గడువు ఉంది. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు ఒక్క పూట ఆ తర్వాత జరిగే సబ్జెక్టు పరీక్షకు సంబంధించి విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు బోధించాల్సి ఉం టుంది. స్టడీ అవర్‌ నిర్వహించడంతో పాటు వారికి ఉండే సందేహాలను తీర్చనున్నారు. పరీక్ష సందర్భంగా అనుసరిం చాల్సిన విధానాల గురించి టిప్స్‌ అందించనున్నారు. ఏదీ ఏమైనా మారిన పరీక్షల విధానం అటు.. విద్యార్థులకు, ఇటు.. ఉపాధ్యాయులకు సవాల్‌గా మారనున్నది. ఎంత వరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - Mar 08 , 2026 | 01:06 AM