Peddapally : రామగుండంలో మెగా ఓసీపీ
ABN , Publish Date - May 04 , 2026 | 01:26 AM
గోదావరిఖని మే 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ రామగుండం కోల్ మైన్ పేర మెగా ఓసీపీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది.
రెండు ఓసీపీలు, మూడు భూగర్భ గనులతో మెగా కోల్‌మైన్
కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి
314.9 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
యేటా 20మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని మే 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ రామగుండం కోల్ మైన్ పేర మెగా ఓసీపీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది. ఇంతకాలం ఎదు రుచూస్తున్న కేంద్ర పర్యావరణ శాఖ నుంచి శుక్రవారం మౌఖిక అనుమ తులు లభించాయి. మరో పదిరోజుల్లో అనుమతి పత్రాలు సింగరేణికి చేరనున్నాయి. సింగరేణి చరిత్రలో అత్యధికంగా ఏడాదికి 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టును రూపొందించారు. గనుల తవ్వకాలలో మిగిలిపోయిన బొగ్గు నిల్వలను వెలికితీయడానికి ఈ మెగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నడుస్తున్న రెండు ఓసీపీ ప్రాజెక్టులతోపాటు మూడు భూగర్భ గనుల పరిధిలోని బొగ్గు వెలికితీయ డానికి సింగరేణి ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించింది. ప్రాజెక్టు ద్వారా 314.89 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీస్తారు. యేటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ 25 ఏళ్ళ పాటు రామగుండం కోల్‌మైన్ మెగా ఓసీపీ సింగరేణి భవిష్యత్‌కు దోహదపడనున్నది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే బొగ్గును రామగుండం ఎన్‌టీపీసీకి ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న ఇతర బొగ్గు ఆధారిత సంస్థలకు సరఫరా చేయనున్నారు. మూతపడిన జీడీకే 10 భూగర్భ గని, గతంలో మూతపడిన వకీల్‌పల్లె భూగర్భ గనులతోపాటు వీటికి ఆనుకుని ఉన్న రామగుండం ఓసీపీ-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్-2, రామగుండం ఓసీపీ-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టు భూగర్భ అంచుల్లో మిగిలి ఉన్న బొగ్గును గరిష్టంగా వెలికితీసేందుకు మెగా ఓసీపీని రూపొం దించారు. గతంలోనే అనేక అనుమతులు ఉన్న మూతపడిన బొగ్గు గనులు, ఓసీపీ విస్తరణ ప్రాజెక్టు వలన తక్కువ వ్యయంతో పర్యావరణ ఇబ్బందులు లేకుండా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ఈ ప్రాజెక్టును తలపెట్టింది. మూతపడనున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడంతోపాటు రామగుండం రీజియన్‌కు మరో 25 ఏళ్ళ జీవితకాలాన్ని పెంచనున్నది.
భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకాలు పూర్తయిన తర్వాత భౌగోళిక పరిస్థితుల రీత్యా మిగిలిపోయిన బొగ్గు నిల్వలను తవ్వి తీసేందుకు సింగ రేణి ఇలాంటి పద్ధతులను అవలంభిస్తున్నది. గతంలో మూతపడిన భూగర్భ గనుల స్థానంలో ఓసీపీ ప్రాజెక్టులను తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా కొత్తగూడెంలోని గౌతంఖని ఓసీపీ, మణుగూరు ఏరియాలో మణుగూరు ఓసీపీతోపాటు కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్‌మైన్స్ ప్రాజె క్టును సింగరేణి ప్రారంభించింది. ఇదే తరహాలో రామగుండం ఏరియా-1 లోని జీడీకే 10 ఇంక్లయిన్ గనిలో మిగిలి ఉన్న 56.79 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను, రామగుండం ఏరియా-2లో త్వరలో మూతపడనున్న వకీల్‌పల్లె గనిలో మిగిలి ఉండే 28.99 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు ఓపెన్‌కాస్ట్ తరహా మైనింగ్ జరపాలని సింగరేణి యోచించింది. దీంతోపాటు రెండు గనులకు అతి సమీపంలో ఉన్న రామగుండం ఓసీపీ-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్-2 మధ్య సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ హెచ్చరిక నేపథ్యంలో వదిలివేసిన 25.98 మిలియన్ టన్నుల బొగ్గు, గనుల పక్కన ఇరువైపుల ఉన్న సుమారు 3.90 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయాలనే ప్రయత్నంలో సింగరేణి ఉన్నది. ఓసీపీ-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్‌గ్రౌండ్ విస్తరణ గనుల సరిహద్దులో మిగిలి ఉన్న బొగ్గును కూడా ప్రాజెక్టులో భాగంగా వెలికితీయనున్నారు. దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతం నుంచి 182.28 మిలియన్ టన్నుల బొగ్గు, భూగర్భ గనుల ప్రాంతం నుంచి 132.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మెగా ఓసీపీ ద్వారా వెలికి తీయనున్నారు. మెగా ఓసీపీ నుంచి సగటున బొగ్గు గ్రేడ్ జీ10 స్థాయిలో ఉండనున్నది. మొత్తం ఐదు గనుల పరిధిలోని బొగ్గు తీయడానికి ముందుగా మూతపడిన జీడీకే 10 ఇంక్లయిన్ భూగ్భ గనిని ఓసీపీగా మారుస్తారు. దీనిని ఓసీపీ-1 గనిని ముందుకు కొనసాగిస్తూ షావల్, డంపర్ పద్ధతిలో తవ్వుకుంటూ వెళ్తారు. ఈక్రమంలో వచ్చే ఓవర్‌బర్డెన్ (మట్టి) ఆర్జీ ఓసీపీ-1 ఎక్స్‌టెన్షన్ ఫేజ్-2లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఇలా 8 ఏళ్ళపాటు జీడీకే 10 ఇంక్ల యిన్ ప్రాంతంలోని బొగ్గును బయటకు తీయనున్నారు. తర్వాత వకీల్‌పల్లె గనిని ఓసీపీగా మారుస్తారు. దీనికి సంబంధించిన ఓబీని అప్పటికే పూర్తయిన 10 ఇంక్లయిన్ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా ఓబీని బొగ్గు తీసిన ప్రదేశంలో నింపనున్నారు. బొగ్గు తవ్వకాన్ని లాంగ్‌వాల్, కంటిన్యూస్ మైనర్, బోర్డర్ మైనర్స్, రోడ్డు హెడ్డర్స్ ద్వారా షావల్, డంపర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. మొత్తం మెగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు 4,326.08 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి అవసరం. ప్రాజెక్టులో 5,403 మంది సింగరేణి ఉద్యోగులు, 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేయనున్నారు. మొత్తం 2.194.05 కోట్ల రూపాయల మూల పెట్టుబడితో ప్రాజెక్టు ప్రారంభం కానున్నది.
రామగుండం రీజియన్‌లోని మూడు డివిజన్‌లలో పాత గనులు, మూతపడుతున్న సమయంతో మెగా ఓసీపీ ఏర్పడుతుండంతో ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యే ప్రమాదాన్ని ప్రాజెక్టు నివారించనున్నది. సింగరేణి ఉత్పత్తి లోటును కూడా ప్రాజెక్టు భర్తీ చేయనున్నది. రామగుండం ఎన్‌టీపీసీ బొగ్గు అవసరాలకు మెగా ఓసీపీ భరోసా ఇవ్వనున్నది.