Share News

Peddapally : నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు..

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:55 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Peddapally :  నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు..

- జిల్లాలో ఒక నియోజకవర్గం పెరిగే అవకాశం

- ఒకే జిల్లాలో నియోజకవర్గాలు

- మంథని నియోజకవర్గం పూర్తిగా జిల్లాలోనే

- ధర్మారం మండలం కూడా జిల్లాలోనే ఉండే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలకు తోడుగా మరొక నియోజకవర్గం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తాజాగా మరో 60 నియోజకవర్గాలు పెరగనుండడంతో జిల్లాలో కొత్తగా నియోజకవర్గం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎక్కడ కొత్త నియోజకవర్గం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నది. ప్రస్తుతం పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలు పూర్తిగా జిల్లాలోనే ఉండగా, మంథని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాతో పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కలిసి ఉన్నది. ఈ నియోజకవర్గం జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్‌ మండలాలతోపాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మల్హర్‌, మహాదేవపూర్‌, పలిమెల, మహా ముత్తారం మండలాలు కలిసి ఉన్నాయి. అలాగే జిల్లాలోని ధర్మారం మండలం ధర్మపురి నియోజకవర్గంలో కలిసి ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సగం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేపడుతారా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చేపడతారా అనే విషయమై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లాలో ఒక నియోజకవర్గం కొత్తగా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వివిధ జిల్లాల్లో కలిసి ఉన్న నియోజకవర్గాలను ఒకే జిల్లాలో ఉండే విధంగా పునర్విభజన చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

కొత్తగా సుల్తానాబాద్‌ నియోజకవర్గం ఏర్పడే అవకాశం

జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దపల్లి నియోజక వర్గంలోనే రెండు మున్సిపాలిటీలతోపాటు ఆరు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,62,145 మంది ఓటర్లు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేష న్‌తోపాటు పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,29,097 మంది ఓటర్లు ఉన్నారు. మంథని నియోజకవర్గం రెండు జిల్లాల్లో కలిసి ఉంది. ఈ నియోజకవర్గంలో 2,30,478 మంది ఓటర్లు ఉండగా, జిల్లా పరిధిలోని నాలుగు మండలాల్లో 1,23,437 మంది ఓటర్లు ఉన్నారు. ధర్మారం మండలం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ మండలంలో 42,447 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మం థని నియోజకవర్గాన్ని పూర్తిగా పెద్దపల్లి జిల్లాలోనే కలపడంతో పాటు, ధర్మారం మండలాన్ని కూడా జిల్లాలోని ఏదో ఒక నియో జకవర్గంలో కలిపే అవకాశాలు ఉన్నాయి. పెద్దపల్లి నియోజక వర్గంలో ఉన్న సుల్తానాబాద్‌ కేంద్రంగా కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దపల్లి నియోజక వర్గాన్ని పెద్దపల్లి, జూలపల్లి, ధర్మారం మండలాన్ని కలుపుకొని ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయనున్న సుల్తానాబాద్‌ నియోజక వర్గంలో సుల్తానాబాద్‌తో పాటు ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ఎలిగేడు మండలాలను కలిపే అవకాశాలు ఉన్నాయి. రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్‌తో పాటు పాలకుర్తి, అంతర్గాం మండలాలు కలిసి ఉన్నాయి. రామగుండం నియోజకవర్గంలోని యైుటింక్లయిన్‌ కాలనీ ప్రాంతాన్ని మంథని నియోజకవర్గంలో కలిపే అవకాశాలు కనబడుతున్నాయి.

ఫ రాజకీయ పార్టీల నేతల్లో ఆశలు

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో ఉన్న మూడు నియోజక వర్గాలతో పాటు కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానున్నదననే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎక్కడ కొత్త నియో జకవర్గం ఏర్పాటు అవుతుంది, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోని మండలాలు ఏఏ నియోజకవర్గాలకు బదలాయింపు అవుతాయనే చర్చ జరుగుతున్నది. అయితే నియోజకవర్గాల పునర్విభజన అంశం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వారిలో ఆసక్తి నెలకొన్నది. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొందితే మాత్రం ఏ నియో జకవర్గం మహిళలకు కేటాయిస్తారనే చర్చ కూడా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంకేతాల ప్రకారం జిల్లాలో ఒక నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు అవుతుందనే ఆశాభావంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 12:55 AM