Peddapally : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి!
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:26 AM
పెద్దపల్లి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు, సంబంధిత విద్యాశాఖాధికారులతో కలిసి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
- ప్రథమ సంవత్సరంలో 57.09 శాతం
- ద్వితీయ సంవత్సరంలో 68.29 శాతం
- గత ఏడాది కంటే ఫలితాల్లో వెనుకంజ
పెద్దపల్లి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు, సంబంధిత విద్యాశాఖాధికారులతో కలిసి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 57.09 శాతం, ద్వితీయ సంవత్సరంలో 68.29 శాతం ఫలితా లను సాధించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలి తాల్లో విద్యార్థులు వెనుకంజ వేశారు. ప్రథమ సంవత్స రంలో 5.36 శాతం, ద్వితీయ సంవత్సరంలో 1.74 శాతం తక్కువ ఫలితాలను పొందారు. గత ఏడాది ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలవగా, ఈసారి 24వ స్థానంలో, ద్వితీయ స్థానంలో గత ఏడాది 11వ స్థానంలో నిలవగా, ఈసారి 27వ స్థానంలో నిలి చారు. ఎంపీసీ, బైపీసీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాల్లో యేటా బాలుర కంటే బాలికలే పైచేయి సాధిస్తున్నారు. గతంలో కంటే ఈసారి బాలుర ఉత్తీర్ణత శాతం మరింత తగ్గిపోతున్నది. బాలురు నానాటికి తీసికట్టుగా మారుతున్నట్లు కనబడుతున్నది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన బాలురు తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ బాలురు ఫలితాల్లో వెనుకంజలో ఉండడం ఆందోళనను కలిగిస్తున్నది.
ఫ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 4116 మంది విద్యార్థులకు గాను 2350 మంది 57.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1704 మందికి 668 మంది 39.20 శాతం, బాలికలు 2412 మందికి గాను 1682 మంది 69.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. వోకేషనల్ విభాగంలో 1004 మంది విద్యార్థులకు గాను 549 మంది 59.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 422 మందికి 154 మంది 36.49 శాతం, బాలికలు 582 మందికి గాను 445 మంది 76.46 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 3762 మంది విద్యార్థులకుగాను 2509 మంది 68.29 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1536 మందికి 845 మంది 55.01 శాతం, బాలికలు 2226 మందికి గాను 1724 మంది 77.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో 1003 మంది విద్యార్థులకు గాను 740 మంది 7.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 445 మందికి 284 మంది 62.69 శాతం, బాలికలు 518 మందికి గాను 460 మంది 88.80 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు..
ఇంటర్‌మీడియెట్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. పెద్దపల్లి ట్రినిటీ కళాశాలకు చెందిన మేకల అస్మిత ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 495 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో గుంజపడుగు రమ్యశ్రీ 993 మార్కులు, దిడ్డి వైష్ణవి 992 మార్కులు, బూర్ల శిరీష 992 మార్కులు, బెజ్జంకి సంతోషిణి 992 మార్కులు, కొలిపాక వర్షిణీ 991 మార్కులు, ఎర్రోజు శ్రీహిత 990, చోట నాగ చైతన్య 990, పోగుల తనివిత్య 990, తోట నిషిద్ధ 985 మార్కులు సాధించారు. సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కేజీబీవీ పాఠశాలకు చెందిన బి సౌమ్య ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో 994 మార్కులు, సీఈసీలో బి.శ్రీజ 928 మార్కులు సాధించారు.
ఫ మే 13 నుంచి సప్లమెంటరీ పరీక్షలు
మే 13వ తేదీ నుంచి రెండు సెషన్లలో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లిం చేందుకు గడువు విధించారు. పరీక్షలకు సంబంధించి రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 100 రూపాయలు, జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం 800 రూపాయల ఫీజు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి కల్పన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.